ఆలేరు మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి
యాదగిరిగుట్టకు ఆలయ ఆదాయంలో వాటా ఇవ్వాలి.. ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి
ఆలేరు, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ఆలేరు నియోజకవర్గంలోని (Alair Constituency)ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల(Yadagirigutta Municipality) అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Aleru MLA Beerla Ilaiah)ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలకు సొంత ఆదాయ వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ ప్రజలకు మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రోజుకు సుమారు లక్ష మంది భక్తులు వస్తున్నందున, భక్తులకు అవసరమైన సేవలను మున్సిపాలిటీ అందిస్తోందన్నారు. గతంలో గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు ఆలయ ఆదాయంలో వాటా లభించేదని, ప్రస్తుతం మున్సిపాలిటీకి కూడా ఆలయ ఆదాయంలో తగిన వాటా కేటాయించాలని కోరారు.
యాదగిరిగుట్ట అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మించిన బ్రిడ్జి కారణంగా సుమారు 200 మంది వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి జీవనోపాధికి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు సమస్యాత్మకంగా ఉన్న బ్రిడ్జిని తొలగించాలని కోరారు. అభివృద్ధి పనుల్లో ఇళ్లు, షాపులు, భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని, సైదాపూర్‌లోని 329.314 సర్వే నంబర్ పరిధిలో అర్హులకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఆలేరు మున్సిపాలిటీకి అవసరమైన నిధులు కేటాయించి రహదారులు, డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని అయిలయ్య కోరారు. అలాగే ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే ప్రజల చిరకాల డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరారు.
బీర్ల అయిలయ్య ప్రస్తావించిన యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి నిధులు కేటాయింపు, బ్రిడ్జి సమస్య పరిష్కారం, ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉతమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందని, ఇళ్ల నిర్మాణంలో ఆలేరు నియోజకవర్గం ముందంజలో ఉందని అయిలయ్య తెలిపారు.