పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
సిరిసిల్ల పోక్సో కోర్టు తీర్పు రూ.1,000 జరిమానా
రాజన్న సిరిసిల్ల 18సెప్టెంబర్ (విజయక్రాంతి): ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్ (Yellareddypet Police Station)పరిధిలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు చతుర్‌సింగ్ మున్నాకు సిరిసిల్ల పోక్సో కోర్టు (POCSO Court)20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. శుక్రవారం న్యాయమూర్తి రాధికా జైస్వాల్ (Justice Radhika Jaiswal)తీర్పు వెల్లడించారు.
బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ బన్సీలాల్ కేసు నమోదు చేయగా, అప్పటి డీఎస్పీ చంద్రశేఖర్ దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో 19 మంది సాక్షులను ప్రవేశపెట్టగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్సీ వాదించారు. నేరం రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష విధించింది.
మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. కేసులో కృషి చేసిన పోలీసు అధికారులు, పీపీ, కోర్టు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.