గణేష్ నిమజ్జనానికి పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు...

18-09-2026 | 04:52pm

బాన్సువాడలో శోభాయాత్ర రూట్ మ్యాప్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

బాన్సువాడ, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ (Police Department)ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గణేష్ శోభాయాత్ర నిర్వహించనున్న రూట్ మ్యాప్‌ను(Route Map) శుక్రవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) పరిశీలించారు. పట్టణంలోని పాత బాన్సువాడ కొత్త బాన్సువాడలో రెండు రోజులపాటు జరగనున్న గణేష్ శోభాయాత్ర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, రహదారి పరిస్థితులు తదితర అంశాలను జిల్లా ఎస్పీ  పరిశీలించారు. శోభాయాత్ర సజావుగా సాగేలా అవసరమైన బందోబస్తు, బారికేడ్లు, ఇతర భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు.గణేష్ నిమజ్జనాన్ని ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పోలీసులకు సహకరిస్తూ నిబంధనలు పాటించాలని కోరారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిమజ్జన కార్యక్రమాన్ని సురక్షితంగా నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. అనంతరం బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రాజచంద్ర హాజరై వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో భక్తులకు మహా అన్నదానాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్,డిఎస్పి విట్టల్ రెడ్డి, ఆర్డీవో రవీందర్ రెడ్డి,రూరల్ సీఐ తిరుపతయ్య పట్టణ సిఐ శ్రీధర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు