ఓటు దొంగతనంపై సమరశంఖం..

27-10-2026 | 04:29pm
  1. ఓటు హక్కును కాపాడుకోవడమే లక్ష్యం.. నవంబర్ 1న ఢిల్లీ రాంలీలా మైదానంలో భారీ నిరసన
  2. హోటల్ వివేరాలో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. ఓటర్ల జాబితాలో అక్రమాలపై కాంగ్రెస్ నేతల ధ్వజం
  3. ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంరెడ్డి సర్వోత్తమరెడ్డిని గెలిపించాలని పిలుపు

ఆలేరు,అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఓటు హక్కును పరిరక్షించుకోవడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ(Congress Party) చేపట్టిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’(Save the Vote – Save the Nation) ఉద్యమాన్ని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. 

మంగళవారం భువనగిరి, హోటల్ వివేరాలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఓటు హక్కుపై దాడిని సహించం

బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు. ఓటు హక్కును హరించే ప్రయత్నాలను ప్రజాస్వామ్యవాదులంతా ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించి, జాబితాలో మార్పులపై పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ సంఘీభావం ప్రకటించాలని అన్నారు.

ఓటర్ల సంఖ్యపై అనుమానాలు.. పారదర్శకతకు డిమాండ్, ఓటర్ల సంఖ్యకు సంబంధించిన గణాంకాలు, ఓట్ల తొలగింపుపై వస్తున్న ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఓటర్ల పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు నిబంధనలకు అనుగుణంగా జరగాలని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకు విలువ ఉంటుందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులకు అన్యాయం జరిగితే పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

నవంబర్ 1న ఢిల్లీకి కాంగ్రెస్ శ్రేణులు

ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నవంబర్ 1న నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీర్ల ఐలయ్య కోరారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కుంభం అనిల్ కుమార్ రెడ్డి సూచించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్‌గా ఉందని నాయకులు తెలిపారు.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తమరెడ్డికి మద్దతు:

ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమరెడ్డిని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు. సర్వోత్తమరెడ్డి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు