ఐపీఎస్‌ పాఠశాలలో దీపావళి వేడుకలు

07-11-2026 | 08:26pm

సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థుల సందడి

సుల్తానాబాద్‌,(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్(Sultanabad) పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌ (ఐపీఎస్‌)లో ముందస్తు దీపావళి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో అందమైన రంగవల్లులు తీర్చిదిద్ది, దీపాలను వెలిగించి దీపావళి సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

విద్యార్థుల సందడితో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ మాటేటి కృష్ణప్రియ హాజరై విద్యార్థులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని పేర్కొన్నారు.

ఇటువంటి పండుగల నిర్వహణ ద్వారా విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని, బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకుప్రాధాన్యతనిస్తూ సురక్షితమైన దీపావళిని జరుపుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు.ఈ వేడుకల్లో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ సునీత ఉపాధ్యాయినులు, విద్యార్థినీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు