డిఫెన్స్ మద్యం దందా.. భర్తలు తెస్తే.. భార్యలు అమ్ముతారు!

07-11-2026 | 03:38pm

ఆల్వాల్: డిఫెన్స్ క్యాంటీన్లలో మాజీ సైనికులకు కేటాయించే మద్యం పక్కదారి పడుతోంది. తక్కువ ధరలకు కొనుగోలు చేసిన మద్యం బాటిళ్లను బయట అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు భర్తలు క్యాంటీన్ల నుంచి మద్యం తీసుకొస్తుండగా, వారి భార్యలు ఇళ్ల వద్దే విక్రయాలు సాగిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది. తాజాగా ఆల్వాల్ ప్రాంతంలో రెండు వేర్వేరు చోట్ల ఎక్సైజ్ శాఖ (Excise Department) అధికారులు దాడులు నిర్వహించి మొత్తం 163 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు.

మల్కాజిగిరి ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రదీప్‌రావు, ఆయన బృందానికి అందిన సమాచారం మేరకు సరస్వతీనగర్, లోతుకుంట ప్రాంతంలోని మన్యం నాగప్రసన్న, రామాంజనేయులు ఇంటిపై తనిఖీలు నిర్వహించారు. అక్కడ డిఫెన్స్ మద్యం బాటిళ్లను అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 96 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో రామాంజనేయులు డిఫెన్స్ క్యాంటీన్ నుంచి మద్యం బాటిళ్లను తీసుకువస్తుండగా, ఆయన భార్య మన్యం నాగప్రసన్న ఇంటి వద్ద వాటిని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో భార్యాభర్తలిద్దరిపై కేసు నమోదు చేశారు. నాగప్రసన్నను అరెస్టు చేసి ఆల్వాల్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు అసిస్టెంట్ కమిషనర్ ప్రదీప్‌రావు వెల్లడించారు.

ఇదే తరహాలో మరో ఘటన న్యూ బోయినపల్లి పరిధిలోని సౌజన్య కాలనీలో వెలుగుచూసింది. ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీమ్-బి సీఐ గణపతిరెడ్డి తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ముసిమి లెంక (39) అనే మహిళ ఇంట్లో డిఫెన్స్ మద్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. సోదాల్లో 67 మద్యం బాటిళ్లు బయటపడటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. విక్రయాలకు పాల్పడుతున్న మహిళను అరెస్టు చేసి ఆల్వాల్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ విషయాన్ని సీఐ గణపతిరెడ్డి వెల్లడించారు.

ఆల్వాల్ ప్రాంతంలో ఒకే సమయంలో వెలుగుచూసిన ఈ రెండు ఘటనలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. డిఫెన్స్ క్యాంటీన్లలో తక్కువ ధరలకు లభించే మద్యం బాటిళ్లను అక్రమంగా ఇతరులకు విక్రయిస్తున్న వ్యవహారంపై ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ రెండు కేసుల్లో కలిపి 163 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోగా, వాటి విలువ సుమారు రూ.2.11 లక్షలుగా అంచనా వేశారు.

డిఫెన్స్ కోటా మద్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అక్రమ విక్రయాలపై సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు