బీఆర్ఎస్పై మంత్రి తుమ్మల విమర్శలు
బీఆర్ఎస్ వైఫల్యాలకు కాంగ్రెస్ సర్కార్ మరమ్మతులు: తుమ్మల
హకీంపేటలో అగ్రి, ఇండస్ట్రియల్ ఎక్స్పో ప్రారంభం..
పాలమూరును పసిడి పంటల సీమగా తీర్చిదిద్దడమే లక్ష్యం
హైదరాబాద్: గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థతో పాటు కీలక అభివృద్ధి రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Agriculture Minister Tummala Nageswara Rao) విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం(Kodangal Constituency)లోని హకీంపేటలో శనివారం నిర్వహించిన అగ్రి ఎక్స్పో స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం రైతుమేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) తీవ్ర సమస్యలను ఎదుర్కొందని, దానిని సరిదిద్దేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న వాతావరణ పరిస్థితులను కూడా రాజకీయంగా వాడుకుంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
కృష్ణా, గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోలేని పరిస్థితికి గత ప్రభుత్వ నిర్ణయాలే కారణమని తుమ్మల వ్యాఖ్యానించారు. కమీషన్ల కోసం చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఆశించిన ప్రయోజనాలు దక్కలేదని విమర్శించారు. మరోవైపు రైతులకు నిరంతర విద్యుత్ అందించేందుకు యూనిట్‌కు రూ.10 నుంచి రూ.15 వరకు వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని వివరించారు.
పాలమూరు ప్రాంతాన్ని వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి చేసి, రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని మంత్రి వెల్లడించారు. పాలమూరు జిల్లాను పసిడి పంటలతో కళకళలాడే ప్రాంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.