నకిలీ విత్తనాలతో నష్టం

07-11-2026 | 08:52pm

నష్టపరిహారం అందించాలి

రైతుల డిమాండ్

60 నుంచి 70 ఎకరాల్లో విత్తుకున్న రైతులు

తాడ్వాయి,(విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పంటలు వేసుకొని జీవనం సాగిద్దామనుకున్న రైతన్నలకు కష్టాలు తప్పడం లేదు.నకిలీ విత్తనాలు నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల మండలంలో ఓ కంపెనీకి చెందిన నకిలీ విత్తనాలతో మొక్కజొన్న రైతు తీవ్రంగా నష్టపోయారు.అది మరువకముందే మరో నకిలీ విత్తనాల ఘటన బయటపడింది.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో రాజ్మా బీర్నీస్ నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలో 30 నుంచి 40 మంది రైతులు 60 నుంచి 70 ఎకరాలలో రాజ్మా విత్తనాలు వేసుకున్నారు.కానీ విత్తనాలు నకిలీవి కావడంతో మొలకెత్తలేదు.దీంతో రైతులు బోరుమని వినిపిస్తున్నారు.

అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు

నకిలీ రాజ్మా బిర్నీస్ విత్తనాలతో నష్టపోయామని స్థానిక వ్యవసాయ శాఖ అధికారి నర్సింలు,ఏ ఈ ఓ లకు చెప్పినా సదరు వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై నష్టపోయిన రైతులు తాడ్వాయిలో మాట్లాడారు.రాజ్మా విత్తనాలతో నష్టపోయాం, ఒక్కసారి మా పొలాలను పరిశీలించండి అని వేడుకున్న సదరు వ్యవసాయ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదని రైతులు ఆరోపిస్తున్నారు.వ్యవసాయ శాఖ అధికారులు సదరు వ్యాపారితో కుమ్మక్కయ్యారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నకిలీ విత్తనాలు అందించిన వ్యాపారి

మండలంలోని దేమికలాన్ గ్రామానికి చెందిన దుడుక గంగయ్య రైతులకు రాజ్మా బిర్నీస్ విత్తనాలు అందించారు.ఒక్కో ఎకరాకు సదరు వ్యాపారి 40 కిలోల చొప్పున విత్తనాలు అందించారు.దీనికి రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. పంట దిగుబడి వచ్చిన తర్వాత ఒక్కో క్వింటాలు రూ.7 వేలకు విక్రయించాలని సదరు వ్యాపారి రైతులతో ఒప్పందం చేసుకున్నారు.కానీ సదరు వ్యాపారి ఇచ్చిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు వీరే

రాజ్మా బీర్నీస్ నకిలీ విత్తనాలు విత్తుకొని తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన మర్రి వీరయ్య,బండారి రాజు, మర్రి మోహన్, పని గంగారాం,మర్రి నడిపి మోహన్,మర్రి సాయిలు,కన్కల్ కు చెందిన వెలమ సంతోష్ రెడ్డి,నల్లవెల్లి సాయి రెడ్డి, రామస్వామి,ఎలేటి తిరుపతిరెడ్డి,దేమికలాన్ గ్రామానికి చెందిన ఆశన్న గారి సుధాకర్ రెడ్డి, బాలూరి చిన్న రాజిరెడ్డి,పుట్ట ప్రకాష్, కుంట ప్రకాష్ లతోపాటు చందాపూర్,బ్రహ్మాజీ వాడి,గ్రామాలకు చెందిన 30 నుంచి 40 మంది రైతులు ఉన్నారు.

నష్టపరిహారం అందించాలి

అధికారులు స్పందించి తమకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.ఒక్కో ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి పెట్టి నష్టపోయామని తెలిపారు.కనీసం పెట్టిన పెట్టుబడి అయిన పరిహారంగా అందించాలని కోరుతున్నారు. పరిహారం అందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నష్టపోయిన రైతులు వెలమ సంతోష్ రెడ్డి, గుట్టకాడి స్వామి రెడ్డి, మోహన్, రాజశేఖర్, రాజు, పని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు