ఆదివాసీ సంస్కృతి పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత

07-11-2026 | 08:40pm

దండారి ఉత్సవాలను  గిన్నిస్ బుక్ లోకి  తీసుకువచ్చేందుకు కృషి చేస్తా

దండారి ఉత్సవాల్లో  హేత్మాసూర్  దేవత పూజాసామాగ్రి కోసం 15000

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్,( విజయక్రాంతి): ఉట్నూరు మండలం మత్తడిగూడ గ్రామంలో నిర్వహించిన దండారీ ఉత్సవాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో  మంద మకరందు(ITDA PO Manda Makarandu)తో కలిసి ఆదివాసీ సంప్రదాయ నృత్యంలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఒక్కో దండారీకి రూ.10 వేల ఆర్థిక సాయం అందించగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy)తో మాట్లాడి ఆ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచి అందిస్తున్నామని తెలిపారు.

చెక్కుల పంపిణీలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో నేరుగా దండారీలకే చెక్కులు అందిస్తున్నామని, దండారీ ఉత్సవాల నిర్వహణకు షెడ్ల ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, తన చివరి శ్వాస వరకు ఆదివాసీ సంస్కృతిని పాటిస్తానని అన్నారు.

వెయ్యి మంది దండారీలతో ప్రపంచ స్థాయిలో రికార్డు సాధించడమే తన జీవిత లక్ష్యమని, గిన్నిస్ బుక్ లో  దండారి ఉత్సవాలను  చేర్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సోమవారం తన నివాసంలో మూడు గ్రామాలకు చెందిన ఆదివాసీ మహిళలు ప్రదర్శించనున్న సంప్రదాయ నృత్య కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై తిలకించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పిఓ మంద మకరంద్ , ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.

కొమురం భీమ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూరు మండలం దొంగిచింత గ్రామంలో నిర్వహించిన ఆదివాసీ వీరుడు కొమురం భీమ్  వర్ధంతి కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  పాల్గొని, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో పాల్గొని ఆదివాసీ సంప్రదాయ నృత్యం చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆదివాసీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు