సమంత సీమంతం అలా చేయడం తప్పే!
ప్రముఖ ఆస్ట్రాలజర్, ఆధ్యాత్మికవేత్త లతా జంధ్యాల సందేశం
విధివిధానాలు తెలియనివారిని శ్రీచక్రం(Sri Chakra)లో కూర్చోపెట్టడం సరికాదు
సీమంతం.. ఈ పదం తెలియని మహిళలు ఉండరు. ముఖ్యంగా వివాహితులకు ఈ కార్యం ఒక ఆనందదాయకమైన శుభకార్యం. గర్భందాల్చిన ఐదో నెల ఈ కార్యం చేస్తుంటారు. పండ్లు, పలహారాలతో గర్భిణికి వేడుక నిర్వహిస్తారు. ఈ సీమంతం(Baby shower) ఇప్పుడు సోషల్‌మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. సమంత(Samantha) సీమంతం పేరిట ప్రజల్లో చర్చకు దారి తీసింది. ఈ అంశంపై ప్రముఖ ఆస్ట్రాలజర్, ఆధ్మాత్మికవేత్త లతా జంధ్యాల(Latha Jandhyala) పలు విషయాలను ‘విజయక్రాంతి’తో పంచుకున్నారు. ఆమె చెప్పిన పలు అంశాలు ఆమె మాటల్లోనే&
సమంత సీమంతం అనేది సోషల్‌మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. నిజంగా గర్భిణిగా ఉన్నవాళ్లకు సీమంతం ఒక పండుగలాంటిది. అయితే, ఇక్కడ శ్రీచక్రంలో కూర్చోబెట్టి సీమంతం చేయొచ్చా అనేది చాలామందిలో సందేహాలు ఉన్నాయి. మామూలుగా అమ్మవారిని యంత్రము.. తంత్రము.. మంత్రముతో ఆరాధిస్తుంటారు. వీటిలో యంత్రానికి సంబంధించి కేంద్ర బిందువు అనేది ఉంటుంది. ఆ బిందువులో లలితా త్రిపురసుందరి ఉంది అనే భావనతో గురు పరంపరలో శిష్యులు అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటారు.
అయితే, ఇక్కడ అందరి ప్రశ్న.. శ్రీచక్రంలో సమంతకు సీమంతం చేయొచ్చా? లేదా? అనేది! ప్రస్తుత రోజుల్లో సెలబ్రిటీస్ ఎలా వ్యవహరిస్తుంటారో ప్రజలు కూడా ఆచరించడానికి ఎక్కువగా మక్కువ ప్రదర్శిస్తుంటారు. ఇంతకుముందు సమంత ఒక సినిమాలో ధరించిన చీరలు.. ఎంతో ఫేమస్‌గా మారాయి. చాలామంది సమంత చీరలు అంటే కట్టుకున్నారు.. ఇదేకోవలో సమంత సీమంతం విధానం కూడా జనం ఆచరించాలనుకోవడం సాధారణమనే చెప్పుకోవాలి.. అయితే.. సమంత సీమంతం తీరులో తప్పుగా ఉందని ఆధ్యాత్మికవేత్త లతా జంధ్యాల అభిప్రాయపడ్డారు.
ఆచారవ్యవహారాలు కచ్చితంగా పాటించాల్సిందే..
అయితే, శ్రీచక్రానికి సంబంధించి మాత్రం కచ్చితంగా ఆచార వ్యవహారాలను పాటించి తీరాల్సిందే. ఎందుకంటే త్వరలో రాబోయే దేవీ నవరాత్రులలో అమ్మవారిని వివిధ పూజా విధానాలతో ఆరాధిస్తుంటారు. ఆ ఆరాధనలో ఎవరైతే ఉంటారో వారికి గురువులు మంత్రోపదేశం చేస్తుంటారు. అలాగే ఇక్కడ శ్రీచక్రంలో కూర్చోబెట్టినప్పుడు కూడా ఆ చక్రానికి సంబంధించిన ఉపాసన చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారికి శ్రీచక్రంలో కూర్చునే అర్హత లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లతా జంధ్యాల అభిప్రాయపడ్డారు.
వాస్తవానికి శ్రీచక్రం చాలా పవర్‌ఫుల్ అంటుంటారు. ఏ చిన్న పొరపాటు దొర్లినా దోషాలు అంటుకుంటాయంటారు. సాధారణంగా శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ఎక్కువ సాహసించరు. అందుకు యంత్రోపాసన అవసరం. యంత్రోపాసన అంటే అంత సులువేమీ కాదు.. అంటూ చెప్పుకొచ్చారు లతా జంధ్యాల.
సీమంతం అంటే...
ఇక ఇక్కడ మన సీమంతం అనే విషయాన్ని తీసుకుంటే.. గర్భిణికి సంబంధించి సీమంతం వేడుకలు చేస్తుంటారు. దీన్నే బేబీ షవర్ అని కూడా అంటున్నారు. అసలు సంప్రదాయం చెప్పిన బేబీ షవర్ ఎంతమంది ఫాలో అవుతున్నారు? అసలు సంప్రదాయం, మన పద్ధతి, మన ఆచార వ్యవహారము, శాస్త్రము ఎంతమంది అనుసరిస్తున్నారు? బేబీ షవర్ అనగానే పలు ప్రసార మాధ్యమాలలో చూస్తున్నట్టుగా షాపింగ్ చేయడం, లేదంటే ఫొటోస్ తీసుకోడమేనా? అసలు సీమంతం వెనకాల ఉన్న అర్థం ఏమిటి? ఎంతమందికి తెలుసు? దాని వెనకాల ఒక అర్థం ఉంది.
పుట్టబోయే బిడ్డకు ఎలాంటి అపకారం కలగకూడదు అనే ఒక ఆకాంక్ష దాగుంది. అంతేకాదు, ఆ గర్భిణి కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. వేదం చెప్పిన మంత్రాలతో గర్భిణిని ఆశీర్వదిస్తుంటారు. అంతేకాదు, ఇక్కడ భర్త కూడా కొన్ని నియమనిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. గర్భిణి డెలివరీ అయ్యేవరకు భర్త కేశాలు తీయకూడదనే ఆచారం అనాదిగా వస్తోంది. మరి ఇన్ని ఆచార వ్యవహారాలతో కూడుకున్న ఒక సంప్రదాయాన్ని పక్కనపెట్టి శ్రీచక్రంలో ఒక హీరోయిన్‌ను కూర్చోబెట్టేసి మేం చేసేసాము అని చెప్పుకోవడం..
దాన్ని సోషల్‌మీడియాలో వైరల్ చేయడం అనేది సరికాదు. సమంత సీమంతం అనే కార్యక్రమాన్ని నేను యాక్సెప్ట్ చేయను.. శ్రీచక్రోపాసన చేసేవాళ్లు అందరు కూడా దీన్ని ఆక్షేపిస్తారనే అనుకుంటున్నాను.. అని ఆధ్యాత్మికవేత్త లతా జంధ్యాల చెప్పుకొచ్చారు. అయితే, సమంత విషయంలో ఇక్కడ గురువులు చెప్పినట్టు ఆమె చేసి ఉండొచ్చు. శ్రీచక్రం విధి విధానాలు తెలియని వ్యక్తిని తీసుకెళ్లి కూర్చోబెట్టడం తప్పు అని అభిప్రాయపడ్డారు.
గర్భంలో శిశువు వినగలదా?
గర్భంలో ఉన్న శిశువు మనం మాట్లాడుకునే మాటలు, మంత్రోచ్ఛారణలు వినగలడా అనే సందేహాలు చాలామందికి వస్తుంటాయి. ప్రహ్లాదుడు తన తల్లి కడుపులో ఉన్నప్పుడు నారదుడు విష్ణులీలలు చెప్పడం.. జననం తర్వాత ప్రహ్లాదుడు విష్ణు భక్తుడిగా మారడం.. మన పురాణగాథల్లో ఉంది. అలాగే అర్జునుడి కుమారుడు అభిమాన్యుడు.. అతను కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే శస్త్ర విద్యలు అన్నీ నేర్చుకున్నాడని మహాభారతంలో చదువుకున్నాం. అంతెందుకు.. కొందరు పసిపిల్లలు చిన్నప్పటి నుంచే కొన్ని విషయాల్లో ఫాస్ట్‌గా ఉంటారు.. అలాంటి వారిని వీడు గట్టిపిండం అని అంటుంటారు.
అంటే ఆ పసిపిల్లలు గర్భంలో ఉన్నప్పుడు దైవారాధనలు వినడం బిడ్డకు పుష్టి చేకూరడం, శరీరం దృఢంగా ఉండడం జరుగుతుంది.. అంటే తల్లి శరీరంలోనే ఆమె ధాతువులను తీసుకుంటూ ప్రతి విషయానికి స్పందిస్తూ గర్భంలో పెరుగుతుంటారనేది పెద్దలు చెబుతుంటారు. అందుకే ఏడో నెల నుంచి గర్భిణులను విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలని, ఆధ్యాత్మికమైన విషయాలపై దృష్టి పెట్టాలని మన పెద్దలు చెబుతుంటారు. అయితే, ఇదంతా వితండవాదం అనుకునే వాళ్లు కూడా ఉన్నారు.. ఎవ్వరు ఏమనుకున్నా.. మన ఆచారం పాటించడం అందరికీ శ్రేయస్కరం.. అని లతా జంధ్యాల తన అభిమతాన్ని వెల్లడించారు.
సంప్రదాయాలను గౌరవించాలి
ఆచారం ఏం చెప్పిందో అది చేయడం మంచిది. భగవంతుడితో రిస్క్ వద్దు. ఇక్కడ సమంతను శ్రీ చక్రంలో కూర్చోబెట్టడంలో ఆవిడకు ఏమైనా మంత్రోపాసన ఉందా? అలా ఉంటే సరి. లేదంటే అపచారంగా భావించాలి. అదీగాక, ఆవిడతో పాటు ఫోటోలు దిగిన వాళ్ళందరూ శ్రీచక్రాన్ని తొక్కినట్టే కదా! అలాంటప్పుడు అమ్మవారిని ఏవిధంగా ఆరాధించినట్టు అవుతుంది? సమంత చేసిందనో.. మరో సెలబ్రిటీ చేసుకుందనో.. అందరూ శ్రీచక్రంలో సీమంతం చేసుకుంటాం.. ఆ చక్రాన్ని తొక్కుతూ ఫొటోలు దిగుతాం అంటే.. మహారుషులు ఎంతో సాధన చేసి పొందిన శ్రీచక్రం విలువ ఏమై పోతుందని ఆధ్యాత్మిక వేత్త లతా జంధ్యాల ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి ఆచార వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై చిత్రాలు తీయడమో.. వీడియోలు చేయడమో చేస్తే.. సెలబ్రిటీలు ఆచితూచి వ్యవహరించాలనేది నా అభిప్రాయం. ముఖ్యంగా మంత్రతంత్ర యంత్రాలలో ప్రవేశం లేకుండా, ఆచార నియమాలు తెలియకుండా దానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమము చేయకూడదు. ఇక్కడ శ్రీచక్రం అనేది ఎంతో పవిత్రమైనది. భక్తితో పూజించే ఒక యంత్రం. అలాంటి వాటిని ఉపయోగించే సమయంలో మన ఆచార వ్యవహారాలను పాటించడం సమాజానికి శ్రేయస్కరమని.. ఆధ్యాత్మికవేత్త లతా జంధ్యాల సెలవిచ్చారు.
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త
లతా జంధ్యాల