వారంలో 20 టీఎంసీలు గాయబ్!

20-09-2026 | 05:30am

గేటు కొట్టుకుపోయిందన్న సాకుతో ఏపీకి యథేచ్ఛగా కృష్ణా నీళ్లు

  1.    104 టీఎంసీలకు పడిపోయిన శ్రీశైలం రిజర్వాయర్ 
  2. గేటు ఘటనపై అనేక అనుమానాలు
  3. పునరుద్ధరణపై కావాలని ఏపీ జాప్యం!
  4. తెలంగాణ సర్కార్ చర్యలు శూన్యం
  5. మండిపడుతున్న తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ఒక వైపు ఎల్ నినో(El Nino) ప్రభావం.. మరోవైపు శ్రీశైలం(Srisailam) నుంచి ఖాళీ అవుతున్న కృష్ణా నీళ్లు(Krishna water).. తెలంగాణ రైతులను(Telangana farmers') కలవరపెడుతున్నాయి. గేటు కొట్టుకుపోయిందన్న సాకుతో వారం రోజుల్లో దాదాపు 20 టీఎంసీల కృష్ణా జలాలు ఏపీకి వెళ్లిపోయాయి. ఇంకా వెళ్తూనే ఉన్నాయి. అయినా తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) ఎలాంటి చ ర్యలు తీసుకోవడం లేదని, ఏపీ ప్రభుత్వం కావాలని పునరుద్ధరణ పనుల్లో జాప్యం చేస్తున్నదని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు(Telangana Retired Engineers) అంటున్నారు.  ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర ప్రమాదం తప్పదని వారు ఆందోళన చెందుతున్నారు. 

వారంలో 20 టీఎంసీలు

ఈ నెల 10 మధ్యాహ్నం పోతిరెడ్డిపాడు వద్ద 9వ నెంబరు గేటు రోప్ తెగిపోయి కొట్టుకుపోయింది. ఆ సమయంలో శ్రీశైలం రిజర్వాయర్‌లో  సుమారు 865.7 ఫీట్ల నీటి మట్టం (సుమారు 127 టీఎంసీలు) ఉంది. ఇది కాస్తా 11 తారీఖు నాటికి 865.6 ఫీట్ల (124.6 టీఎంసీలు)కు చేరింది. అంటే ఒక్క రోజులోనే సుమారు 2.4 టీఎంసీల నీళ్లు ఖాళీ అయ్యాయి.

కొట్టుకుపోయిన 9వ నెంబరు గేటు నుంచి సుమారు 22,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం వెళ్లే అవకాశం ఉందని నిపుణులు స్పష్టంగా చెప్తున్నారు. ఈ లెక్కన ప్రతిరోజూ సుమారు 2 టీఎంసీల పరిమాణంలో కృష్ణా జలాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికీ గేటును పునరుద్ధరించకపోవడంతో.. గడిచిన 10 రోజులుగా పోతిరెడ్డిపాడు నుంచి నిరంతరాయంగా కృష్ణా జలాలు ఏపీ వైపు పరుగులు పెడుతూనే ఉన్నాయి. 

n ఈ నెల 11 తారీఖు నాటి నీటి మట్టం.. ఈ నెల 19 తారీఖు నాటి నీటి మట్టంతో పోల్చుకుంటే సుమారు 20 టీఎంసీల నీరు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఖాళీ అయింది. 

n ఈ నెల 19న శ్రీశైలం లో 859.4 ఫీట్ల నీటి మట్టం (104.1 టీఎంసీలు) ఉన్నట్టుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఈ నెల 11 నాడు 124.6 టీఎంసీల నీటి పరిమాణం కాస్తా.. తొమ్మిది రోజుల్లో 104.1 టీఎంసీలకు తగ్గడంతో.. 20 టీఎంసీలు రిజర్వాయర్ నుంచి వెళ్లిపోయినట్టు స్పష్టమవుతున్నది. 

ప్రమాదమా.. కుట్రపూరితమా..?

ఈ నెల 10న మధ్యాహ్నం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద గేట్లు ఎత్తే సమయంలో ప్రమాదవశాత్తు ఐరన్ రోప్ తెగిపోవడంతో 9వ నెంబరు గేటు కొట్టుకుపోయిందని ఏపీ అధికారులు చెప్తున్నారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక కుట్రపూరితంగా జరిగిందా.. అనేదానిపై తెలంగాణవాదులు, తెలంగాణ ఇంజనీర్లు అనేక అనుమానాలను లేవనెత్తుతున్నారు. కేవలం వారం పది రోజుల్లోనే 20 టీఎంసీల నీళ్లు ఖాళీ అయినా.. తెలంగాణ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ఇక్కడి రిటైర్డ్  ఇంజనీర్లు విమర్శిస్తున్నారు.

గేటు కొట్టుకుపోయిన ఘటనపై ఏపీ ప్రభుత్వంతో, కేఆర్‌ఎంబీతో సీరియస్‌గా మాట్లాడాల్సిన అవసరం ఉన్నా.. తెలంగాణ సర్కార్ స్పందించడం లేదని అంటున్నారు. అటు ఏపీ కూడా నిర్లిప్త ధోరణిలోనే ఉంది. ఎంత ఆలస్యం అయితే.. అంత లాభం అనేలాగా వ్యవహరిస్తున్నది. వీలైనంత వరకు కృష్ణా జలాలను  తరలించేందుకే ప్రయత్నిస్తున్నది. అందుకే గేటు పునరుద్ధరణ విషయంలో తామేం చేయలేమనేలా చేతులెత్తేస్తున్నది. 

దెబ్బ మీద.. దెబ్బ..!

ఇప్పటికే ఎల్ నినో ప్రభావం కారణంగా.. తెలంగాణలో పంటల మనుగడ కష్టంగా మారింది. సాగునీటి మాట దేవుడెరుగు.. కనీసం తాగునీటికైనా కట కట లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఏర్పడింది. గేటు కొట్టుకుపోయిందన్న సాకుతో దాదాపు వారం పదిరోజుల్లో శ్రీశైలం నుంచి 20 టీఎంసీల నీళ్లు ఏపీ వైపు వెళ్లిపోయాయి. ఇంకా వెళ్తూనే ఉన్నాయి. ఇది ఇలా కొనసాగితే తెలంగాణకు మరింత జలగండం తప్పదని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇన్నిరోజులవుతున్నా గేటు పునరుద్ధరణ విషయంలో ఒక్క అడుగుకూడా ముందుకు పడకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగాలని, శ్రీశైలం రిజర్వాయర్ నీటి పరిమాణాన్ని కాపాడితే.. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల తాగునీటి అవసరాలనైనా తీర్చుకోగలమని వారు అంటున్నారు.  

మరిన్ని వార్తలు