ప్రైవేటు ఉపాధ్యాయులకు సర్కార్ అండ: ఎమ్మెల్యే నాయిని

20-09-2026 | 02:01pm

హనుమకొండ,సెప్టెంబర్ 20(విజయ క్రాంతి): ప్రైవేటు అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy) అన్నారు. హనుమకొండ లోని శ్రీహర్ష కన్వెన్షన్‌ లో తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఎమ్మెల్యే నాయిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.విద్యా రంగంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే వారు ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. 

ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం కాదని, సమాజానికి విద్యను అందించే బాధ్యతతో కూడుకున్న సేవ అని అన్నారు.విద్య, వైద్యం అత్యంత కీలకమైన అంశాలని, రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు రంగాలకు ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఆరోగ్య భద్రత కోసం ప్రైవేట్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డుల అంశాన్ని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని చెప్పారు. ఈ వారంలోనే ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి, వచ్చే ఏడాది నాటికి అమలు చేసే విధంగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాల్లో ప్రైవేట్ ఉపాధ్యాయులు కూడా అర్హత మేరకు దరఖాస్తు చేసుకుని ప్రయోజనం పొందాలని ఎమ్మెల్యే సూచించారు. ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని నాయిని రాజేందర్ రెడ్డి  తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు చందర్ లాల్ నాయక్ చౌహన్ , హనుమకొండ ఎంఈఓ నెహ్రు నాయక్, ప్రముఖ వైద్యుడు కూరపాటి రమేష్,హనుమకొండ,కాజీపేట మండలంలో పనిచేసే ప్రైవేటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



మరిన్ని వార్తలు