పిల్లల భవిష్యత్తుకు తొలి ఆరేళ్లే కీలకం

01-11-2026 | 05:00am

మెదడు అభివృద్ధిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి 

రాధిక ఎన్ ఆచార్య, కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ చైల్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్, మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ 

హైదరాబాద్, 31 అక్టోబర్ (విజయక్రాంతి): పిల్లల జీవితంలో తొలి ఆరేళ్లు వారి భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యంత కీలకమైన దశ అని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్ హాస్పిటల్స్‌(Medicover Women & Child Hospitals)కు చెందిన కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ చైల్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ రాధిక ఎన్. ఆచార్య పేర్కొన్నారు. ఈ సమయంలో మెదడు అసాధారణ వేగంతో అభివృద్ధి చెందుతుందని, ప్రతి సెకనుకు పది లక్షలకు పైగా నాడీ సంబంధాలు ఏర్పడతాయని తెలిపారు.

ఐదేళ్ల వయస్సుకే మెదడు వయోజనుల మెదడు పరిమాణంలో సుమారు 90 శాతానికి చేరుకుంటుందని వివరించారు. పుట్టినప్పటి నుంచి మూడేళ్ల వరకు భాష, ఇంద్రియ జ్ఞానం, భావోద్వేగ అనుబంధాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని, మూడు నుంచి ఆరేళ్ల మధ్య జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం మెరుగుపడతాయని ఆమె తెలిపారు.

పిల్లల మెదడు అభివృద్ధికి ఖరీదైన బొమ్మల కంటే తల్లిదండ్రుల సమయం, ప్రేమ, శ్రద్ధ ఎంతో ముఖ్య మన్నారు. పిల్లలతో మాట్లాడటం, కథలు చెప్పడం, కలిసి ఆటలు ఆడటం, పుస్తకాలు చదివించడం వంటి అలవాట్లను ప్రోత్సహించాలని సూచించారు. అధిక స్క్రీన్ వినియోగాన్ని తగ్గించి సృజనాత్మక ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పిల్లలకు ప్రేమ, భద్రత, ప్రోత్సాహం అందించే కుటుంబ వాతావరణం వారి మానసిక, భావోద్వేగ ఎదుగు దలకు బలమైన పునాదిగా నిలుస్తుందని రాధిక ఎన్. ఆచార్య పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు