రబీ ఆముదం దిగుబడిపై రైతులకు శిక్షణ

01-11-2026 | 09:35am

శాస్త్రీయ సాగు పద్ధతులు, పంట యాజమాన్యంపై అవగాహన

అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ల ఎంపికపై సూచనలు

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): రబీ ఆముదంలో అధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రీయ సాగు పద్ధతులు, సమగ్ర పంట యాజమాన్యంపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం(Professor Jayashankar Telangana State Agricultural University) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఐసీఏఆర్‌–ఐఐఓఆర్ నిధులతో ఎస్సీ ఉప ప్రణాళికలో భాగంగా అమ్రాబాద్ మండలంలోని జాంగిరెడ్డిపల్లె, వొంగురునిపల్లె గ్రామాల రైతులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సహ పరిశోధనా సంచాలకులు డా. ఎల్. కృష్ణ మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో సాగు ఖర్చులు తగ్గించుకోవాలని, తక్కువ కాలవ్యవధి పంటలను ఎంచుకోవాలని సూచించారు.

ప్రధాన శాస్త్రవేత్త డా. డి. శశిభూషణ్ నూనెగింజల పంటల సాగు, నాణ్యమైన విత్తనోత్పత్తిపై వివరించారు. కె. మమత తేలికపాటి నేలల్లో పంట సాంద్రత, సమతుల్య ఎరువుల వినియోగం, కరువు పరిస్థితుల్లో పంట నిర్వహణ గురించి వివరించారు. డా. జి. ఈశ్వరరెడ్డి కరువును తట్టుకునే, వడలుతెగులు నిరోధక ఆముదం హైబ్రిడ్ల ఎంపికపై అవగాహన కల్పించారు. అనంతరం రైతులు వేరుశనగ నూనె మిల్లు ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ అవకాశాలను తెలుసుకున్నారు. శ్రీమతి జి. మాధురి, డా. వి. దివ్యరాణి ఆముదం పంటలో చీడపీడల యాజమాన్యంపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమం ముగింపులో రైతులకు ఆముదం విత్తనాలను పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు