గుడి గుమ్మం వద్ద చెత్త కుప్పలు
పంచాయతీ గుమ్మంలో పొగ కష్టాలు!
శ్రీరంగాపూర్: వనపర్తి జిల్లా(Wanaparthy district) శ్రీరంగాపురం మండలంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయ(Sri Ranganayaka Swamy Temple) ప్రవేశ ద్వారం, వంతెన సమీపంలో గ్రామపంచాయతీ(Gram Panchayat) ఆధ్వర్యంలో చెత్తను పేరబెట్టి తగలబెడుతున్న ఘటనపై భక్తులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ దర్శనానికి ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే భక్తులకు, గ్రామస్తులకు చెత్త నుంచి వెలువడే పొగతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు.
ఆలయ పరిసరాల్లోనే చెత్త కుప్పలు దర్శనమివ్వడం వల్ల గ్రామంపై భక్తుల్లో చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పవిత్రతను, పరిసరాల పరిశుభ్రతను కాపాడేలా వెంటనే అక్కడి చెత్తను తొలగించి, గ్రామపంచాయతీకి కేటాయించిన చెత్త నిర్వహణ ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. ఇకపై ఆలయ ప్రవేశ ద్వారం, వంతెన పరిసరాల్లో చెత్త వేయకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.