పంటలు ఎండిపోతుంటే పట్టించుకోరా?
రైతులకు 12 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాల్సిందే!
లక్ష్మాపూర్ స్టేజ్ వద్ద రైతుల ధర్నాకు మాజీ ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి మద్దతు
రామాయంపేట,(విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్న రైతులకు కీలక సమయంలో విద్యుత్ కోతలతో ఇబ్బందులు కల్పించడం సరికాదని మాజీ ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి(Former Deputy Speaker Padma Devender Reddy) అన్నారు. వ్యవసాయానికి రోజుకు 12 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెదక్(Medak) జిల్లా రామాయంపేట మండలంలోని 765-డీజీ జాతీయ రహదారిపై లక్ష్మాపూర్ స్టేజ్ వద్ద విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు ధర్నా నిర్వహించారు. కాట్రియాల్, లక్ష్మాపూర్, పర్వతాపూర్, దంతేపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. రైతుల నిరసన(Farmers Protest)కు మాజీ ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరి పంట పొట్ దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే పంటలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పంటలకు అవసరమైన సమయంలో సాగునీరు అందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతులు పంటల సాగు కోసం విద్యుత్‌పై ఆధారపడుతున్నారని, ఇలాంటి కీలక సమయంలో కోతలు విధించడం వల్ల వారి కష్టం వృథా అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.రైతుల శ్రమకు తగిన ఫలితం దక్కాలంటే సకాలంలో సాగునీరు అందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
రోజుకు 12 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.పంటలు చేతికందే కీలక సమయంలో విద్యుత్ కోతల కారణంగా రైతులు నష్టపోకుండా అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తొలగించి, రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో రైతులు, సర్పంచులు,మాజీ సర్పంచ్లు,మాజీ ఎంపీటీసీలు, పట్టణ,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.