అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ఈ నెల 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా(Kumram Bheem Asifabad district)లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు(Anganwadi Teachers), ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 9 నుంచి 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
అర్హతలు: అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ఆయా పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అందుబాటులో లేని పక్షంలో పదో తరగతి ఉత్తీర్ణులను పరిగణనలోకి తీసుకుంటారు. 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు సంబంధిత గ్రామపంచాయతీ లేదా పట్టణ వార్డుకు చెందిన స్థానిక మహిళలై ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతల మార్కులకు 70 మార్కులు, జిల్లా ఎంపిక కమిటీ ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు. వితంతువులకు 5, అనాథలకు 10, దివ్యాంగులకు 5 ప్రత్యేక మార్కులు కేటాయించనున్నారు. అభ్యర్థులు వయస్సు, నివాసం, కులం, విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలతో పాటు వర్తించే ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు https://wdcw.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టు, ఈ-మెయిల్ లేదా ఇతర మార్గాల్లో సమర్పించిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. ప్రాజెక్టుల వారీగా ఖాళీలు, ఇతర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలని అధికారులు సూచించారు.