అధికారులకే సమయపాలన లేదా..?

29-10-2026 | 11:49am

శ్రీరంగాపూర్, అక్టోబర్ 29: వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలంలో నిర్వహించాల్సిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమీక్ష సమావేశానికే సమయపాలన కరువైతే, ప్రజలకు అధికారులు ఎలాంటి సందేశం ఇస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన కీలక సమావేశం నిర్ణీత సమయానికి ప్రారంభం కాకపోవడం అసహనానికి దారితీసింది. ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా, 11:30 గంటలు దాటినా ప్రారంభం కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే సమీక్షా సమావేశాలకే సమయపాలన (Punctuality) పాటించకపోతే పాలనలో క్రమశిక్షణ ఎక్కడ ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరుకావాల్సిన సమావేశాల్లో సమయపాలన అత్యంత కీలకం. అయితే, నిర్ణీత సమయానికి సమావేశం ప్రారంభం కాకపోవడంతో విలువైన సమయం వృథా అవుతోందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలకు సమయపాలన పాటించాలని సూచించే అధికారులే సమావేశాలకు ఆలస్యంగా వస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మండల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సమీక్షించాల్సిన సమావేశాలు ఆలస్యంగా ప్రారంభమైతే కీలక అంశాలపై చర్చకు ఎంత సమయం కేటాయిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇకనైనా సంబంధిత అధికారులు సమయపాలనపై దృష్టి సారించి, ప్రజాప్రతినిధుల సమావేశాలకు నిర్ణీత సమయానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. సమయపాలనపై ఇతరులకు పాఠాలు చెప్పే అధికారులే ఆచరణలో నిర్లక్ష్యం వహిస్తే పాలనా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుందనే ప్రశ్న స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు