లీకేజీల లొల్లి.. రోడ్లపాలవుతున్న తాగునీరు!
ఇల్లెందు టౌన్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): ఇల్లెందు పట్టణంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ (Mission Bhagiratha Pipeline) లీకేజీలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పట్టణంలోని ఎస్‌బీఐ ప్రధాన శాఖ సమీపంలోని బుగ్గవాగు వద్ద బుధవారం రాత్రి పైప్‌లైన్ లీకేజీ కావడంతో తాగునీరు వృథాగా పోయింది. దీంతో ఆమ్‌బజార్ ప్రాంతమంతా నీటితో నిండిపోయింది.
పట్టణంలో తరచూ పైప్‌లైన్లు లీకేజీ అవుతున్నప్పటికీ, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లీకేజీల కారణంగా విలువైన తాగునీరు వృథా కావడంతో పాటు రహదారులపై నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పైప్‌లైన్ లీకేజీలకు శాశ్వత పరిష్కారం చూపాలని, తాగునీటి వృథాను అరికట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పట్టణవాసులు కోరుతున్నారు.