చెంచుల గోడు.. సీతక్క దృష్టికి!
కొల్లాపూర్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి పరిధిలోని చెంచుగూడెంలో ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ లింగమ్మ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. గురువారం హైదరాబాద్లోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో మంత్రిని కలిసి గూడెం ప్రజల ఇబ్బందులను వివరించారు.
చెంచుగూడెంలో రహదారి సౌకర్యం (Road Connectivity) సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్షణమే రహదారి సమస్యను పరిష్కరించడంతో పాటు తాగునీటి వసతి కల్పించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలకు అవసరమైన పౌష్టికాహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఆదివాసుల సమస్యలపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. రహదారి సమస్య పరిష్కారానికి సంబంధించి అటవీ శాఖ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అమరగిరి సర్పంచ్ లింగమ్మ, ఉపసర్పంచ్ మాజీ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.