పెద్దగట్టు జాతరపై యాదవులకే పూర్తి అధికారం కల్పించాలి

27-10-2026 | 04:40pm

రాష్ట్ర పండుగగా ప్రకటించి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలి

చివ్వెంల, అక్టోబర్ 27 (విజయక్రాంతి): యాదవుల ఆరాధ్య దైవం శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరను(Sri Lingamantula Swamy Peddagattu Jatara) రాష్ట్ర పండుగగా ప్రకటించి, అభివృద్ధి పనుల కోసం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, బీసీ రాష్ట్ర నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మంగళవారం తగుళ్ల జనార్దన్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. జాతర నిర్వహణలో యాదవులకు పూర్తి అధికారాలు, నిర్ణయాధికారం కల్పించాలని కోరారు. జాతర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేక క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

ఆరు రాష్ట్రాల నుంచి 30 నుంచి 40 లక్షల మంది భక్తులు హాజరయ్యే ఈ జాతరకు రాష్ట్ర పండుగ హోదా కల్పించి, శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. యాదవులను పేరుకే చైర్మన్లుగా నియమించి, కీలక నిర్ణయాల్లో ఇతరులకు ప్రాధాన్యం కల్పించే విధానాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. యాదవుల హక్కులు, అధికారాలపై ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ చైతన్యం తీసుకొస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు యాదవ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు