ఘనంగా స్వేరో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తుంగతుర్తి,( విజయ క్రాంతి): ఐఏఎస్ అధికారిగా(IAS officer) ఉంటూ నాటి ప్రభుత్వ సహకారంతో గురుకులాల(Residential schools) స్థాపనకు కృషిచేసి ఎంతోమంది పేద విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసిన ఎస్.ఆర్ శంకరన్ జయంతి(Birth Anniversary of S.R. Sankaran) ని పురస్కరించుకొని ,గురుకులాల మాజీ కార్యదర్శి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ (వాలంటరీ అడిషనల్ డీజీపీ) నేతృత్వంలో,
స్థాపించిన స్వేరోస్ డే ఆవిర్భావ వేడుకలను గురువారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ,సీనియర్ స్వేరో నాయకులు కొండగడుపుల ఎల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వేరో రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ నరసయ్య మాట్లాడుతూ...
ఐఏఎస్ అధికారిగా ఉంటూ ఎంతో మంది పేద విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేదరికం నుంచి ఎన్నో కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి ఎస్ఆర్ శంకరన్ అని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా గురుకులాల మాజీ కార్యదర్శి రిటైర్డ్ ఐపిఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో నెట్వర్క్ ను స్థాపించి అక్షరం,
ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం అనే నాలుగు ప్రధాన నినాదాలతో స్వేరో సంస్థ పేద బిడ్డల జీవితాలను ప్రపంచానికి కేంద్ర బిందువుగా నిలబెట్టాలని లక్ష్యంతో పనిచేస్తున్నారని అన్నారు. పేద బిడ్డలకు ఉన్నత విద్య అందించాలని లక్ష్యంతో ఎస్.ఆర్ శంకరన్ స్థాపించిన గురుకులాల స్ఫూర్తిని కొనసాగిస్తూనే డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ "స్వేరోస్ డే" ను నామకరణం చేశారని గుర్తు చేశారు.
మలావత్ పూర్ణ, ఆనంద్ లను ఎవరెస్టు శిఖరం ఎక్కించి "మేము ఎవరి కంటే తక్కువ కాదు"అని స్వేరోలు నిరూపించారని తెలిపారు. డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రేరణతో నేడు స్వేరోలు అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలుస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్వేరో నాయకులు కొండగడుపుల నవీన్, గుండగాని మహేష్, చింతకుంట్ల పరమేష్, పసుపులేటి చింటూ, గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.