పాల్వంచ పట్టణంలో ఘనంగా స్వేరోస్ డే వేడుకలు
అక్షరం.. ఆరోగ్యం.. ఆర్థికం.. నినాదంతో విద్య, సామాజిక చైతన్యానికి పిలుపు
పాల్వంచ, అక్టోబర్ 22, (విజయక్రాంతి): అక్షరం.. ఆరోగ్యం.. ఆర్థికం.. అనే నినాదంతో జ్ఞాన యోధుడు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్(R. S. Praveen Kumar) ఆలోచనల మేరకు 2012లో స్వేరోస్ నెట్వర్క్ ఏర్పాటైంది. గురుకుల పితామహుడు ఎస్.ఆర్. శంకరన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం స్వేరోస్ డే వేడుకలను నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా పాల్వంచ పట్టణంలోని శ్రీ కాలనీ గేటు ఎదురుగా స్వేరోస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చిలకబత్తిని వీరయ్య జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్.ఆర్. శంకరన్ భారతదేశంలో పేదలు, దళితులు, ఆదివాసీలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప ఐఏఎస్ అధికారి, సామాజిక సేవకుడని కొనియాడారు.
విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని విశ్వసించిన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో స్వేరోస్ డేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక పాఠశాలలు, వసతి గృహాల అభివృద్ధికి ఎస్.ఆర్. శంకరన్ విశేష కృషి చేశారని గుర్తుచేశారు.
డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వేరోస్ నెట్వర్క్ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించేలా సైనిక్, స్పోర్ట్స్, కంప్యూటర్, లా, ఫార్మసీ వంటి విద్యా విభాగాల్లో అవకాశాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
స్వేరోస్ ఆశయాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని, యువతలో నూతన ఆలోచనలను పెంపొందించాలని, విద్యార్థులకు స్ఫూర్తినిస్తూ సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ స్వేరోస్ నాయకులు ఐ. కుమార్, కొత్తపల్లి శ్రీను, యువ న్యాయవాది రోహిత్ కుమార్, జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మాజీ జిల్లా అధ్యక్షుడు రవీందర్, సీనియర్ నాయకులు రవికిరణ్, శేషు తదితరులు పాల్గొన్నారు.