ఉద్యోగుల నిరసన సంఘీభావం

31-10-2026 | 08:48pm

నిర్మల్,(విజయక్రాంతి): భైంసా పురపాలక సంఘ(Bhainsa Municipality) కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ అమలుపై నిర్వహించిన సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra)పై పలువురు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉద్యోగులు నిరసిస్తూ శనివారం టీజీఈజేఈసీ, పెన్షనర్ల సంఘం నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను కలిసి సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో నిజాయితీ, నిబద్ధత కలిగిన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందిన కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు, ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్న అధికారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. భైంసా పట్టణ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న కలెక్టర్‌కు ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు ఎల్లవేళలా అండగా ఉంటాయని స్పష్టం చేశారు.

కలెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీజీఈజేఈసీ గౌరవాధ్యక్షుడు ఎం.సి. లింగన్న, ఛైర్మన్ వి. ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి పి.సి. రెడ్డి, టీజీవో ప్రధాన కార్యదర్శి  రమేష్, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రవికుమార్, పెన్షనర్ల సంఘం నాయకులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు