ఘనంగా ఏక్తా దివాస్ వేడుకలు
హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు
దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి:
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadrachadri Kothagudem District) హేమచంద్రపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలను(National Unity Day Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... భారతదేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని అనేక సంస్థానాలను ఏకీకృతం చేసి, భారతదేశ సమగ్రతకు, ఐక్యతకు పునాది వేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి అపారమని కొనియాడారు.
ఆయన దృఢ సంకల్పం, నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడటానికి అంకితభావంతో పనిచేస్తామని, దేశ సమైక్యతను మరింత బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్య నాయక్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.