క్రికెట్‌ను ఏలేస్తాడు
వైభవ్‌పై దిగ్గజాల ప్రశంసలు
దోహా, నవంబర్ 24: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్(Rising Stars Asia Cup) 2026 మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కేవలం 53 బంతుల్లో 204 పరుగులు బాది డబుల్ సెంచరీ సాధించడంతో క్రికెట్ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.‘భారత్ కెప్టెన్ తిలక్ వర్మ వైభవ్ బ్యాటింగ్‌ను వర్ణించడానికి మాటలు లేవని పేర్కొన్నారు. ఈ ఇన్నింగ్స్‌ను అక్షరాల ఊచకోతగా అభివర్ణిస్తూ, తాను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఇదొకటని కొనియాడాడు. వైభవ్ ఒక అరుదైన ప్రతిభ అని, భవిష్యత్ తరం స్టార్ ఆటగాడని శ్రేయస్ అయ్యర్ ప్రశంసించాడు.
అతడి దూకుడైన బ్యాటింగ్ నైపుణ్యాలను వర్ణించడానికి విశేషణాలు సరిపోవన్నాడు. ఇక విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ వైభవ్ ను ఆకాశానికి ఎత్తేశాడు. వైభవ్ గురించి గతంలో చెప్పాను.. ఇప్పుడు చెప్తున్నాననీ, ఈ చిచ్చరపిడుగు క్రికెట్ చరిత్రలో అందరినీ దాటేస్తాడన్నాడు. అన్ని రికార్డులను తిరగరాస్తాడనీ, తన రికార్డులను తిరగరాయాలంటే అది వైభవ్‌కే సాధ్యం అంటూ గేల్ కామెంట్ చేశాడు. ఇలాంటి రికార్డును చూస్తానని అనుకోలేదు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అలాగే ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ కూడా స్పందించాడు.
50 బాల్స్‌లో డబుల్ సెంచరీ చేయడం వైభవ్‌కే సాధ్యమని పాంటింగ్ అన్నాడు. 53 బాల్స్‌లో 35 బౌండరీలు, అందులో 28 సిక్సులు, 7 ఫోర్లు.. ఇది నమ్మలేని విషయం. కానీ నమ్మితీరాలి అంటూ కామెంట్స్ చేశాడు. వైభవ్ బ్యాటింగ్‌పై మాజీ స్టార్ బ్యాటర్ సురేష్ రైనా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇలాంటి బ్యాంటింగ్ మరెక్కడా చూడలేదని ట్వీట్ చేశాడు. వైభవ్ రికార్డు ముందు తన రికార్డు చిన్నబోయినట్లు పేర్కొన్నాడు. ఐపీఎల్లో 2014లో 25 బంతులలో రైనా 87 రన్స్ చేశాడు. అది అప్పట్లో సెన్సేషనల్ ఇన్నింగ్స్. ఆ రికార్డు ఇప్పుడు చిన్నబోయిందని చెప్పాడు.