ఘనంగా కామ్రేడ్ దాయం రాజిరెడ్డి 48వ వర్ధంతి వేడుకలు

25-11-2026 | 07:07pm

తుంగతుర్తి (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ దాయం రాజిరెడ్డి(Dayam Rajireddy) 48వ వర్ధంతి వేడుకలను బుధవారం తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కుటుంబ సభ్యులు మాజీ ఎంపీటీసీ దాయం సుజాతమ్మ, గ్రామస్తులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ తుంగతుర్తి మండల సహాయ కార్యదర్శి కోట రామస్వామి మాట్లాడుతూ.. నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన ధీరుడు కామ్రేడ్ దాయం రాజిరెడ్డి అని కొనియాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం ఆయన తన జీవితాన్ని పోరాటాలకు అంకితం చేశారని గుర్తుచేశారు. పేద ప్రజల పక్షాన నిలబడి, అన్యాయాలను ఎదిరిస్తూ సమాజ మార్పు కోసం కృషి చేసిన ఆయన త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.

కామ్రేడ్ దాయం రాజిరెడ్డి ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆయన చేసిన త్యాగాలకు చిరస్మరణీయ గుర్తుగా వెంపటి గ్రామ ప్రధాన రహదారికి "కామ్రేడ్ దాయం రాజిరెడ్డి మార్గ్ (రోడ్డు)" అని నామకరణం చేయాలని గ్రామపంచాయతీ పాలకవర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు కామ్రేడ్ మనోజ్ కుమార్, వెంపటి గ్రామ మాజీ సర్పంచ్ కొండగడపల నాగయ్య,పెద్దలు పెద్ద మేతరి ముత్తయ్య, తప్పట్లా చిన్న ముత్తయ్య,సోమయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు