అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు

25-11-2026 | 07:05pm

రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం సరికాదు

డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి.

హనుమకొండ, నవంబర్ 26(విజయక్రాంతి):అభివృద్ధిపై చర్చకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని, రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి(DCC President Inagala Venkatramireddy) స్పష్టం చేశారు. బుధవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (డీసీసీ భవన్)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అభివృద్ధి పనులపై చర్చించేందుకు చౌరస్తాకు రావాలని సవాల్ విసిరితే, బీఆర్ఎస్ నేతలు ప్రజా సమస్యలపై చర్చించకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడులకు ప్రయత్నించడం ఏమిటని ప్రశ్నించారు.కేటీఆర్ వరంగల్‌కు వచ్చింది ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాదని, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికేనని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గత పదేళ్ల పాలనలో నగరాన్ని అభివృద్ధి చేయకుండా అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు.

సెంట్రల్ జైలును కూల్చి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూశారని, సరైన ప్రణాళిక లేకుండా ఆసుపత్రి నిర్మాణం చేపట్టారని విమర్శించారు. నగరంలో విద్యాసంస్థల నిర్మాణాలను కూడా మధ్యలోనే వదిలేశారని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారని అన్నారు.కనీసం పార్కింగ్ వసతి లేకుండా కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటు చేయాలని మీరు నిర్ణయం తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలోనే పూర్తి వసతులు ఉండేలా నిర్మాణం చేపట్టామని, ఆనాడు బీఆర్ఎస్ హయాంలో చేసిన తీర్మానంలో కాళోజీ కళాక్షేత్రం ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన నిర్ణయం తీసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

ఇందులో ఎలాంటి కబ్జాలకు తావులేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై ఒక్క కబ్జా ఆరోపణనైనా ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో వేల ఎకరాల భూములు దోపిడీకి గురయ్యాయని, పేపర్ లీకేజీలకు కూడా అప్పటి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆరోపించారు. వరంగల్ నగర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. తాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.500 కోట్లు, అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.6,000 కోట్ల నిధులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులపై నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇస్తే స్వాగతిస్తా మని, రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా అభివృద్ధిపై చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో మరింత బలంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, విజయశ్రీ రాజాలి, మామిండ్ల రాజు, తాడిశెట్టి విద్యాసాగర్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరూరి సాంబయ్య, మాజీ చైర్మన్ రామకృష్ణ, జిల్లా మీడియా సెల్ ఇన్‌చార్జి మార్క విజయ్ కుమార్, లీగల్ సెల్ చైర్మన్ తోట రాజకుమార్, నాయకులు పులి రాజు, బోడడిన్న, రహిమున్నీసా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు