అదరగొట్టిన షూటర్లు! భారత్‌కు డబుల్ బ్రాంజ్
ఆసియా క్రీడల్లో స్కీట్‌లో అదరగొట్టిన షూటర్లు!
నాగోయా: ఐచి-నాగోయా ఆసియా క్రీడల్లో భారత షూటర్లు మరోసారి సత్తా చాటారు. స్కీట్ టీమ్ ఈవెంట్లలో భారత పురుషుల, మహిళల(Women’s Skeet Team) జట్లు కాంస్య పతకాలు సాధించి పోడియంపై నిలిచాయి. దీంతో షూటింగ్లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్లో రైజా ధిల్లాన్(Raiza Dhillon), మహేశ్వరి చౌహాన్, పరినాజ్ ధాలివాల్ అద్భుత ప్రదర్శన చేశారు. మూడు రోజుల అర్హత రౌండ్లలో భారత త్రయం మొత్తం 331 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. చైనా స్వర్ణం, కజకిస్థాన్ రజతం సాధించగా.. భారత్ కాంస్యంతో సరిపెట్టుకుంది.
పురుషుల విభాగంలోనూ భారత షూటర్లు(Indian shooters) పోరాట పటిమ చూపించారు. అనంత్‌జీత్ సింగ్ నరూకా, మైరాజ్ అహ్మద్ ఖాన్, భవ్‌తేగ్ సింగ్ గిల్ జట్టు 346 పాయింట్లు సాధించింది. కజకిస్థాన్‌తో సమాన స్కోరు రావడంతో షూట్-ఆఫ్‌కు వెళ్లాల్సి వచ్చింది. కీలక సమయంలో భారత జట్టు(Indian team) పైచేయి సాధించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఒకే రోజు పురుషుల, మహిళల స్కీట్ జట్లు రెండూ పోడియంపై నిలవడం భారత షూటింగ్ బలాన్ని మరోసారి చాటింది. ఇక స్కీట్ వ్యక్తిగత విభాగాల్లోనూ భారత షూటర్లపై అంచనాలు పెరిగాయి.