‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లకు కొత్త ట్విస్ట్
నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) కీలక మలుపు తిరిగింది. సినిమా టికెట్ రేట్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను హైకోర్టు తీవ్రంగా పరిశీలించింది. టికెట్ ధరల పెంపునకు సంబంధించిన నిర్ణయాన్ని మరోసారి పునఃపరిశీలించాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి(Principal Secretary) కోర్టు సూచించింది. అవసరమైతే మెమోను వెనక్కి తీసుకునే అంశాన్ని కూడా పరిశీలించాలని పేర్కొంది. నాని ‘ది ప్యారడైజ్’(Nani The Paradise)టికెట్ ధరల పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 77లో పలు నిబంధనలు ఉన్నాయని కోర్టు గుర్తుచేసింది. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న సినిమాలకు ధరల పెంపునకు అనుమతి ఇవ్వాలంటే, సినిమా కార్మికుల సంక్షేమానికి సంబంధించిన నిధులను డిపాజిట్ చేయడం సహా నిర్దేశిత షరతులు పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. ‘ది ప్యారడైజ్’కు అనుమతి ఇచ్చిన మెమోలో ఈ వివరాలు స్పష్టంగా లేవని కోర్టు అభిప్రాయపడింది.
చివరి నిమిషంలో నానికి షాక్.. ధరల పెంపుపైనా ప్రశ్నలు
సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందే టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వడంపై కూడా హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇలాంటి నిర్ణయాలను ముందుగానే ప్రజల ముందుంచి అభ్యంతరాలకు అవకాశం కల్పించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న విడుదల కానుండగా, సెప్టెంబర్ 23న ప్రత్యేక ప్రీమియర్ షోకు కూడా ప్రభుత్వం(Government of Telangana) అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో టికెట్ ధరల పెంపుపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు కోర్టు ఈ వ్యవహారంపై ప్రభుత్వం తన కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. దీంతో సినిమా విడుదలకు ముందు టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.