నాని విజ్ఞప్తిపై సీఎం రేవంత్ స్పందన
హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ది ప్యారడైజ్ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో నాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) ఒక కోరిక కోరారు. నాని వినతిపై సీఎం స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తున్నందుకు నానిని అభినందించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేసుకోవాలని నానికి సీఎం సూచించారు. దరఖాస్తును అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రేక్షకులతో కలిసి The Paradise ప్రీమియర్ షో చూస్తా.. అనుమతివ్వండని నాని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
''ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ పోలీసు శాఖ(Telangana Police Department) అధికారులకు విన్నపం. సినిమాను అమితంగా ప్రేమించే ఒక అభిమానిగా, మరీ ముఖ్యంగా చిన్నప్పటి నుంచే సినిమాను అత్యుత్తమ స్థాయిలో ఆస్వాదించిన వ్యక్తిగా నేను ఈ విన్నపం చేస్తున్నాను. నాకు సినిమా అంటే, నాలాగే సినిమాను ప్రేమించే వారితో కలిసి చూడటమే.
హైదరాబాద్‌లో ఆ అనుభూతికి RTC X Roads ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. #TheParadise సినిమా ప్రీమియర్ షో (సెప్టెంబర్ 23న) కోసం ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లోని థియేటర్‌ను సందర్శించి, మేము ఎవరి కోసం అయితే ఈ సినిమాను రూపొందించామో, ఆ ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమాను చూడాలని, ఆ అనుభూతిని పొందాలని నేను కోరుకుంటున్నాను. ప్రేక్షకుల మధ్య కూర్చుని, సినిమా పట్ల వారి స్పందనను ప్రత్యక్షంగా చూడటంలోనే ఒక సినిమాను రూపొందించినందుకు లభించే నిజమైన సంతృప్తి ఉంటుందని నేను నమ్ముతాను. అక్కడ అమల్లో ఉన్న అన్ని నిబంధనలు, భద్రతా మార్గదర్శకాలను మేము ఖచ్చితంగా పాటిస్తాము. దానికి మేము అత్యంత ప్రాధాన్యతనిస్తాము. నా విన్నపాన్ని మీరు సానుకూలంగా పరిశీలిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.'' అంటూ నాని ఎక్స్ లోపోస్టు చేశారు.