అదనపు ట్రిప్పు కోసం పరిశీలన

08-10-2026 | 05:05am

బస్సులో ప్రయాణించి పరిశీలించిన ఆర్టీసీ సీఐ

నంగునూరు, అక్టోబర్ 7 (విజయక్రాంతి): నంగునూరు మండలం(Nangunur Mandal) అక్కెనపల్లి మోడల్ స్కూల్(Akkenapalli Model School) విద్యార్థులు బస్సు సౌకర్యం లేక ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై ’విజయక్రాంతి’ దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన ’ప్రమాదకరమని తెలిసినా ఫుట్బోర్డ్ ప్రయాణం’ కథనానికి విశేష స్పందన లభించింది. ఈ వార్త పై స్పందించిన సిద్దిపేట ఆర్టీసీ అధికారులు తక్షణ చర్యలకు ఉపక్రమించారు.బుధవారం ఉదయం సిద్దిపేట నుంచి అక్కెనపల్లి  మోడల్ స్కూల్ మీదుగా ఖాతా వెళ్లే బస్సులో ఆర్టీసీ సీఐ కవితా లక్ష్మి స్వయంగా ప్రయాణించారు.

ఈ ప్రయాణంలో విద్యార్థుల రద్దీని, వారు పడుతున్న ఇబ్బందులు ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు.సుమారు 120 మందికి పైగా విద్యార్థులు ప్రతిరోజూ ఇదే బస్సుపై ఆధారపడి ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు.విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉన్నతాధికారులకు  సమగ్ర నివేదిక అందజేస్తామని, విద్యార్థుల రద్దీ దృష్ట్యా అదనపు ట్రిప్పు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఆమె ’విజయక్రాంతి’ రిపోర్టర్ తో తెలిపారు.విద్యార్థుల ఇబ్బందులను వెలుగులోకి తెచ్చిన పత్రికా కథనంపై విద్యార్థుల తల్లిదండ్రులు,స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు