నకిలీ డాక్యుమెంట్లతో ఆస్తుల దందా.. ముఠా అరెస్ట్

07-10-2026 | 07:11pm

హైదరాబాద్: నకిలీ డాక్యుమెంట్లతో ఆస్తులను తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న ముఠా వ్యవహారం సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఫేక్ జీపీఏలు, సేల్ డీడ్‌లు తయారు చేసి ఇతరుల ఆస్తులను కాజేస్తున్న గ్యాంగ్‌ను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ సుమతి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముఠా 1982 నాటి పత్రాలను సైతం నకిలీగా సృష్టించి, వాటి ఆధారంగా ఫేక్ జీపీఏ డాక్యుమెంట్లు తయారు చేసినట్లు గుర్తించారు.

ముఖ్యంగా విదేశాల్లో ఉంటున్న వ్యక్తుల ఆస్తులను టార్గెట్ చేసి, వివిధ రకాల సేల్ డీడ్‌లతో ఆస్తులపై హక్కులు పొందేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఇదే వ్యవహారంలో ఎల్బీనగర్ పరిధిలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి స్టాంప్ పేపర్లు, నకిలీ స్టాంపులు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అమెరికాలో నివసిస్తున్న వ్యక్తుల పేర్లతోనూ నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

అంతేకాకుండా, నకిలీ పత్రాలను ఉపయోగించి మార్టిగేజ్‌లో ఉన్న ఎనిమిది ఆస్తులను విడుదల చేయించినట్లు ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రాపర్టీకి సంబంధించిన నకిలీ పత్రాల వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సీపీ సుమతి తెలిపారు. ఆస్తుల మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద చర్యలు చేపడతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు