బస్సు వీడియోపై రాజకీయ దుమారం.. చర్యలకు డిమాండ్

07-10-2026 | 06:53pm

మల్‌రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ ఫైర్.. చర్యలకు ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్

హైదరాబాద్: ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి(MLA Malreddy Ranga Reddy) ఆర్టీసీ బస్సులో ఓ యువతితో వ్యవహరించిన తీరుపై వివాదం కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్(BRS) జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) తీవ్రంగా స్పందించారు. ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న వ్యక్తి మహిళలతో వ్యవహరించే సమయంలో వ్యక్తిగత హద్దులు, గౌరవాన్ని పాటించాలని పేర్కొంటూ.. సంబంధిత అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఈ ఘటనపై లీగల్ ఒపీనియన్ తీసుకుని, ఎమ్మెల్యేను విచారణకు పిలవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. అలాగే ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వర్తించే బీఎన్‌ఎస్ నిబంధనల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. మల్‌రెడ్డి రంగారెడ్డి మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు తీరును పరిశీలించే క్రమంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో మాట్లాడినట్లు గతంలో వెల్లడైంది. 

ఈ సందర్భంగా ఓ విద్యార్థినితో జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై బీఆర్ఎస్‌తో పాటు పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. మరోవైపు, వీడియో ఆధారంగా వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్యే వైపు నుంచి వచ్చిన వివరణను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. పూర్తి వాస్తవాలు అధికారిక విచారణ ద్వారా తేలాల్సి ఉంది.

మరిన్ని వార్తలు