అక్రమ కట్టడాలను అడ్డుకునేదెవరు..?
- ఎంఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై కమిషనర్ ఆదేశాలు బేఖాతర్
- నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
- చైన్ మాన్ కనుసైగల్లోనే తెరచాటు వ్యవహారం
- చైన్ మాన్ అండదండలతో రెచ్చిపోతున్న అక్రమ నిర్మాణాల యజమానులు
- బోయిన్‌పల్లి సర్కిల్‌లో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు
- ఎంఎంసీ నిబంధనలు గాలికొదిలేస్తున్న నిర్మాణదారులు
- ఫిర్యాదు వస్తేనే నోటీసులు జారీ.. నోటీసుల పేరుతో అధికారుల వసూళ్లు
సికింద్రాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) (ఎంఎంసీ) పరిధిలో అక్రమ నిర్మాణాలు(Illegal Constructions), అనధికార నిర్మాణాలుఅనేక కాలనీలలో ఊపందుకున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి బహుళ అంతస్థుల భవనాలు(Multi-storey buildings) వెలుస్తున్నా ఇక్కడ ప్రభుత్వ అధికారులు పట్టించుకుంటంలేదని విమర్శలు వెత్తుతున్నాయి. ముఖ్యంగా ఓల్ బోయిన్ పల్లి సర్కిల్(Old Bowenpally Circle) లో అక్రమ కట్టడాలు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నాయి. పలు కాలనీలో బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు.
దీనికి కారణం ఎంఎంసిలో అక్రమ నిర్మాణాలన్నీ చైన్ మెన్ , టౌన్ ప్లానింగ్ అధికారుల కన్ను సన్నలోనే విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని స్ధానికంగా ఆరోపణలు ఆరోపిస్తున్నారు. వీటిని ఆరంభంలోనే నియం త్రించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు, నిర్మాణదారులతో కుమ్మక్కై తమ జేబులు నింపు కుంటూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
ఒకవైపు రాష్ట్ర ప్రభు త్వం అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాలను అడ్డుకట్ట వేయాలని పదేపదే కమిషనర్ డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేస్తున్న ఎంఎంసిలో మాత్రం సంబంధిత కింద స్థాయి అధికారులు ఇటువైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదన్న విమర్శలు వినబడుతున్నాయి.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఉన్నత అధికారులకు పలుమార్లు మొట్టికాయలు చేస్తున్న,ఓల్ బోయిన్ పల్లి సర్కిల్ పరిధిలో అనుమతి లేని భవన నిర్మాణాలను అధికారులే ప్రోత్సాహాకాలు అందిస్తూ, నిర్మాణ దారులతో అధికారులు, చైన్ మాన్‌లు బేరసారాలాడుతూ అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారని స్థానికంగా విమర్శిస్తున్నారు.
ఎంఎంసీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు..
ఓల్డ్ బోయిన్‌పల్లిలో కొన్ని నిర్మాణాలకు అనుమతి లేవు. మరి కొన్నింటికి పాత భవనాలపై అనుమతి తీసుకుని బహుళ అంతస్థులు, కమర్షియల్ షాప్‌లు, పెంట్ హౌజ్‌లు నిర్మిస్తున్నారు. అనుమతి ఉన్న దాని కంటే అదనపు అంతస్తులతో ఎటువంటి సెట్ బ్యాక్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా జి+ 5 భారీ అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారు. దీనిపైన ఓ పెంట్ హౌజ్ నిర్మిస్తున్నారు. అదే విధంగా అంజయ్య నగర్, పాటు పలు కాలనీలో జి +2 అనుమతి తీసుకుని టెంట్ హౌస్ నిర్మాణం చేపట్టిన కొందరు భూ అక్రమార్కులు.
ఎంఎంసి నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా యథేచ్ఛగా మొదలు పెట్టి అధికారులకు తెలియ కుండా నిర్మాణాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. సర్కిల్ పరిధిలోని నాలా పక్కనే అనుమతి ఇవ్వడం లేదని ఎంఎంసి అధికారులు బహిరంగంగా ప్రకటించినా ఇప్పటికే పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వాటిలో కొన్ని పూర్తయిన భవనాలు కూడా ఉన్నాయి. ఆనంద్ నగర్ కాలనీలో ఎలాంటి సెట్ బ్యాక్ లు, నిబంధనలో పాటించకుండా జి+4 అంతస్థుల భారీ అక్రమ నిర్మాణ భవనాలను చేపడుతున్నారు.
ఇది టౌన్ ప్లానింగ్, టిపిఎస్, ఏసీపీ, సిబ్బంది పక్క స్కెచ్‌తో నిర్మాణదారుల నుంచి అమ్యామ్యాల తీసుకోవడం వల్లే ఇలాంటి అక్రమ నిర్మాణాల ను చేపడుతున్నారని స్ధానికులు విమర్శిస్తున్నారు. అనుమతులు లేని బహుళ అంతస్తుల నిర్మాణాలు, కమర్షియల్ షెడ్ల నిర్మాణాలు వెలుస్తున్నాయి. నిర్మాణ దారులతో కాసుల బేరం కుదరకుంటే ఎటువంటి ఫిర్యాదులు లేకున్నా.. ఆగమేఘాల మీద వాలి చిన్నపాటి రం ద్రాలు చేసి, పిట్ట గోడలు కూల్చివేసి, ఆ తదుపరి నిర్మాణదారుల వద్ద నుంచి అందినంత దండుకుని అధికారులు, అక్రమ నిర్మాణదారులను ప్రొత్సహిస్తున్నారని స్ధానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమ నిర్మాణాలపై పత్రికలలో వార్తకధనాలు వెలువడినప్పుడు మాత్రమే అధికారులు, తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేస్తుంటారని, ఆ నోటీసుల పేరుతో నిర్మాణదారుల నుంచి లక్షలలో వసూళ్ల చేసి తమ జేబులు నింపుతూ అధికారు లు తమ పబ్బం గడుపు తున్నారని ఓల్డ్ బోయిన్‌పల్లి సర్కిల్‌లో ఆరోపణలు వినపడుతున్నాయి.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం : డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్
ఓల్డ్ బోయిన్‌పల్లి సర్కిల్ పరిధిలోఅక్రమ నిర్మాణాలపైచర్యలు తీసుకుంటామని,ఇప్పటికే అక్రమ నిర్మాణాలపై కొందరికి నోటీసులు జారీచేశామని డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్ తెలిపారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకుప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. అనుమతులు లేని నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిప్యూటీ కమిషనర్ స్పష్టం చేశారు.
టౌన్ ప్లానింగ్ అధికారి కొమరయ్య వివరణ..
అక్రమ నిర్మాణాలపై ఫోన్లో టౌన్ ప్లానింగ్ అధికారి కొమరయ్య మాట్లాడుతూ కంప్లైంట్ ఉన్నమాట వాస్తవమని,ఇప్పటికే కొందరికి నోటీసులు జారీ చేశామని,పై అధికారుల ఆదేశాలు మేరకు వెంటనే నిర్మాణాలను చర్యలు చేపడతామన్నారు.