చెట్లు పెంచాలా.. నరకాలా?
వ్యవసాయ మార్కెట్ గేట్ ముందు చెట్ల నరికివేతపై ప్రజల ఆవేదన
బెజ్జంకి, సెప్టెంబర్ 22: పర్యావరణ పరిరక్షణ(Environmental Protection)లో భాగంగా ప్రభుత్వం పెద్దఎత్తున మొక్కలు నాటి చెట్లను పెంచాలని పిలుపునిస్తుంటే.. బెజ్జంకి మండల కేంద్రంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోందని ప్రజలు అంటున్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గేట్ ముందు ఉన్న చెట్లను నరికివేయడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏళ్లుగా నీడనిస్తూ, పర్యావరణానికి ఉపయోగపడుతున్న చెట్లను తొలగించడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం పచ్చదనం పెంపునకు చర్యలు చేపడుతుంటే.. మరోవైపు ఉన్న చెట్లను నరికివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
చెట్లను తొలగించాల్సిన అవసరం ఉంటే సంబంధిత అధికారులు కారణాలను ప్రజలకు వెల్లడించాలని, సాధ్యమైనంత వరకు చెట్లను కాపాడేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నరికివేసిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు