కాంగ్రెస్ నేతల కార్లపై రాళ్ల దాడిని ఖండిస్తున్నాం
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలం సుద్దవాగు తండాలో గణేష్ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న కాంగ్రెస్ నాయకుల కార్లపై రాళ్ల దాడి జరగడాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్(Former MPP Koppula Ashok) తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు తుంబూరు దయాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు రామసహాయం నరేష్ రెడ్డి, చావా శివరామకృష్ణ తదితరులు ప్రయాణిస్తున్న కార్లపై దాడి జరిగినట్లు పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మంగీలాల్, కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, పలువురు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.