అభివృద్ధిలో సిద్దిపేట దూసుకెళ్లాలి
- అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి
- బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు
సిద్దిపేట క్రైం,(విజయక్రాంతి): దశాబ్దాల కలగా నిలిచిన సిద్దిపేట జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆకాంక్షించారు. జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన 10K రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా ఏర్పాటు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేశారు. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సిద్దిపేట పర్యటనకు వచ్చినప్పుడు కేసీఆర్ ప్రత్యేక జిల్లా ఏర్పాటును కోరినట్లు తెలిపారు. అనంతరం 2016 అక్టోబర్ 11న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిద్దిపేట జిల్లా ఏర్పాటైందని పేర్కొన్నారు.
జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత సిద్దిపేట అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని హరీశ్ రావు అన్నారు. భవిష్యత్తులోనూ అభివృద్ధి వేగాన్ని కొనసాగిస్తూ విద్యా రంగంలో మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సిద్దిపేటలో యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 10K రన్‌లో పాల్గొన్న యువతను హరీశ్ రావు ఉత్సాహపరిచారు. ఈ క్రమంలో ఆయన యువతతో కలిసి డాన్స్ చేయడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహాన్ని ప్రదర్శించారు.
పదేళ్ల సిద్దిపేట జిల్లా పండుగ వేడుకలను ఘనంగా ప్రారంభించిన మాజీ మంత్రి,బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి 10K రన్‌ను జెండా ఊపి ప్రారంభించిన మాజీ మంత్రి హరీశ్ రావు గారు ఉత్సాహంగా సాగిన 10K రన్.. భారీ సంఖ్యలో పాల్గొన్న యువత, క్రీడాకారులు, పట్టణ ప్రజలు. సిద్దిపేటలో నేటి నుంచి మూడు రోజుల పాటు వైభవంగా సాగనున్న జిల్లా దశాబ్ది పండుగ సంబరాలు. ఉదయం 10 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించనున్న మాజీ మంత్రి హరీశ్ రావు గారు ఉదయం 11 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించే విద్యార్థి-యువజన సదస్సులో పాల్గొననున్న మాజీ మంత్రి. #SiddipetAt10 #10YearsOfSiddipetDistrict
— Office of Harish Rao (@HarishRaoOffice) October 9, 2026