అనుమతుల్లేని తవ్వకాలతో రహదారులు ధ్వంసం

04-11-2026 | 04:10pm
  1. తవ్వి వదిలేశారు.. ప్రయాణికులకు తిప్పలు!
  2. పాడైన రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి
  3. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్

చేర్యాల,నవంబర్ 04: అనుమతులు లేకుండా రహదారులను ఇష్టారాజ్యంగా తవ్వి వదిలేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్(District Executive Committee Member Ande Ashok) ఆర్‌అండ్‌బీ అధికారులను కోరారు.

మంగళవారం చేర్యాల పట్టణంలోని అంగడి బజార్‌లో (Market Bazaar)ఆయన విలేకరులతో మాట్లాడుతూ. నీటి సరఫరా పైపులైన్ల పనుల పేరుతో అంగడి బజార్ చౌరస్తా నుంచి పెద్దమ్మగడ్డ వరకు పలుచోట్ల రహదారులను తవ్వడంతో బీటీ రోడ్డు పూర్తిగా దెబ్బతిని ప్రయాణాలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. ఆకునూరు వరకు కూడా పలు ప్రాంతాల్లో రోడ్లను తవ్వి పూడ్చకుండా వదిలేశారని పేర్కొన్నారు.

ఈ మార్గంలో నిత్యం వందలాది మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారని, రోడ్లు గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికే పలువురు ప్రమాదాలకు గురై గాయాలపాలైన ఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి రోడ్లను తవ్విన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సమస్య పరిష్కరించకుంటే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యుడు ఈరి భూమయ్య, మండల కోశాధికారి నంగి కనకయ్య, మండల కార్యవర్గ సభ్యులు గూడెపు సుదర్శన్, పోషబోయిన పరమశేఖర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు