నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి
ప్రతి గ్రామంలో 40 మంది కూలీలకు ఉపాధి కల్పించాలి: డీపీవో మల్లారెడ్డి
నాగల్‌గిద్ద, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే నీటి కొరత నివారణకు నీటి సంరక్షణ పనులు విస్తృతంగా చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి సూచించారు. శుక్రవారం నాగల్‌గిద్ద మండలంలో నారాయణఖేడ్ డీఎల్‌పీవో సుధాకర్‌రెడ్డితో కలిసి వీబీ–గ్రామ్‌జీ పనులను పరిశీలించారు. గోప్యానాయక్ తండాలో ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీఛార్జ్ పనులు, శేరి దామరగిద్దలో చెక్‌డ్యాం, షాపూర్‌లో ఫామ్‌పాండ్ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో రోజుకు కనీసం 40 మంది కూలీలకు ఉపాధి కల్పించాలని ఆదేశించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, ఫామ్‌పాండ్లు నిర్మించాలని సూచించారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహేశ్వర్‌రావు, ఏపీవో మురళి, ఈసీ సుధాకర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.