పశ్చిమ బెంగాల్‌లో పరారీలో ఉన్న NDPS నిందితుడి అరెస్ట్!
మాల్దాలో గాలించి పట్టుకున్న పటాన్‌చెరు ఎక్సైజ్ ప్రత్యేక బృందం
పటాన్‌చెరు, నవంబర్ 1: హెరాయిన్ (బ్రౌన్ షుగర్)కు సంబంధించిన NDPS కేసులో పరారీలో ఉన్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిందితుడిని పటాన్‌చెరు ఎక్సైజ్ ప్రత్యేక బృందం(Patancheru Excise Team) అరెస్ట్ చేసింది. డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అవినాష్ మహంతి, IPS ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాకు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో నిందితుడిని పట్టుకుంది. అనంతరం నవంబర్ 1న నిందితుడిని పటాన్‌చెరు ఎక్సైజ్ స్టేషన్‌కు తీసుకువచ్చి సంగారెడ్డి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వై. రాధాకృష్ణ రెడ్డి, పటాన్‌చెరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆర్. శ్రవణ్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన ప్రత్యేక బృందాన్ని అభినందించారు.