నల్లగొండ ఆర్టీసీ కార్గోలో అదనపు వసూళ్లు!
ముందే పూర్తి చార్జీలు చెల్లించినా.. పార్సిల్ డెలివరీకి మరో రూ.10 వసూలు
నల్లగొండ, (విజయక్రాంతి): టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్(TGSRTC Logistics) కేంద్రంలో పార్సిల్ డెలివరీ పేరుతో అదనపు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినియోగదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. పార్సిల్ బుకింగ్ సమయంలోనే నిర్ణీత రుసుము పూర్తిగా చెల్లించినప్పటికీ, డెలివరీ సమయంలో మరో రూ.10 చెల్లించాలని నిర్వాహకులు కోరుతున్నట్లు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు సంస్థకు కార్గో నిర్వహణ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఈ అదనపు వసూళ్లు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పూర్తి చార్జీలు చెల్లించిన పార్సిల్‌ను తీసుకునే సమయంలో మళ్లీ డబ్బులు వసూలు చేయడంపై వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ రూ.10 వసూలుకు అధికారిక అనుమతి ఉందా? ఉంటే దానికి సంబంధించిన రసీదు ఎందుకు ఇవ్వడం లేదు? అంటూ నిలదీస్తున్నారు.
రోజుకు పెద్ద సంఖ్యలో పార్సిళ్ల రవాణా, డెలివరీ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి పార్సిల్‌పై రూ.10 చొప్పున వసూలు చేస్తే భారీ మొత్తంలో ఆదాయం సమకూరే అవకాశం ఉందని వినియోగదారులు పేర్కొంటున్నారు. గతంలో అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని ఆర్టీసీ డీఎం జ్యోష్ణ హెచ్చరించినప్పటికీ, వసూళ్లు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, అదనపు వసూళ్లకు అధికారిక అనుమతి ఉందో లేదో స్పష్టం చేయాలని, అనధికారికంగా వసూలు చేస్తున్నట్లయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.