చలో మహారాష్ట్ర

25-10-2026 | 05:25am
  1. తుమ్మిడిహట్టిపై తెలంగాణ సర్కార్ కీలక అడుగులు
  2. 2 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా మహారాష్ట్రతో చర్చలు
  3. 152 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణంపై దృష్టి
  4. ముంపు, నీటి లభ్యతపై సాంకేతిక నివేదికలు సిద్ధం

రేపు ముంబైకి సీఎం రేవంత్‌రెడ్డి బృందం

అక్టోబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ఉత్తర తెలంగాణలోని ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ఆ శాఖ ఉన్నతాధికారుల బృందం ఈ నెల 26 (సోమవారం)న ముంబై వెళ్లనుంది.

మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర సాగునీటి వివాదాలు, ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం తదితర అంశాలపై ఈ పర్యటనలో చర్చించనున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమా రు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో  ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడమే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది. 

ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేసింది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చి తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది. అయితే అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కావడంతో మహారాష్ట్ర భూభాగంలో ముంపు ప్రభావం, నీటి వినియోగం, బరాజ్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఏకాభిప్రాయం సాధించడం కీలకంగా మారింది.

ఈ నేపథ్యంలో ముంబై పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మిస్తే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఎంత మేరకు ముంపు ప్రభావం ఉంటుందనే అంశంపై అధికారులు ఇప్పటికే సాంకేతిక నివేదికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రాజెక్టు ద్వారా ఎంత పరిమాణంలో నీటిని వినియోగించుకోవచ్చు, నీటిని దిగువ ప్రాంతాలకు తరలించేం దుకు ఎలాంటి సాంకేతిక ఏర్పాట్లు అవసరమవుతాయనే అంశాలపైనా అధ్యయనం చేశారు.

మరోవైపు బరాజ్ ఎత్తును 150 మీటర్లుగా నిర్ణయిస్తే అక్కడి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్ వరకు ఎంత మేరకు నీటిని తరలించ వచ్చనే అంశంపై కూడా అధికారులు లెక్కలు రూపొందించారు. ఈ వివరాలపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికా రుల నుంచి సమాచారం సేకరించి ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది.

తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో జరగనున్న చర్చలు సఫలమైతే ఉత్తర తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు కొత్త ఊపిరి లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడటంతో పాటు ప్రతిపాదిత ఆయకట్టుకు నీటిని అందించే దిశగా ముందడుగు పడనుంది. అంతర్రాష్ట్ర సమన్వయం, సాంకేతిక అంశాల పరిష్కారం,

నీటి లభ్యతపై స్పష్టత సాధించడం ఈ పర్యటనలో కీలకంగా మారనున్నాయి. ముంబైలో జరిగే చర్చల ఫలితాల ఆధారంగా తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణంపై తదుపరి కార్యాచరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


 

మరిన్ని వార్తలు