కశ్మీరీలను పాక్ కాపాడుతోందట!

25-10-2026 | 05:25am
  1. ఆ దేశం వల్లే కశ్మీర్ సేఫ్
  2. పాక్ ప్రధాని రక్షణగా ఉన్నారు 
  3. కేంద్ర ప్రభుత్వంతో ఒరిగిందేమీ లేదు
  4. మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు మండిపడ్డ బీజేపీ

శ్రీనగర్, అక్టోబర్ 24: పాకిస్థాన్ వల్లనే జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) ప్రజ లు బతకగలుగుతున్నారని, ఆ దేశంతోనే రక్షణ పొందుతున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షు డు, మాజీ సీఎం ఫరూక్ అబ్దు ల్లా(Former CM Farooq Abdullah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశా రు. ‘మన పొరుగుదేశమైన పాకిస్థాన్.. మన కశ్మీరీలను కాపాడుతున్నది. మన కోసం నిరంతరం మాట్లాడుతున్నది.  కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ రక్షిస్తున్నది.

పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్కడికి వెళ్లినా కశ్మీర్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని గుర్తుచేస్తున్నారు. ఆయన మనల్ని కాపాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం కశ్మీరీలపై సదుద్దేశంతో లేదు’ అని శనివారం జమ్మూకశ్మీర్ లోని బారాముల్లాలో జరిగిన ఎన్సీ కార్యకర్తల సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జమ్మూకశ్మీర్ ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశించలేమని వ్యాఖ్యానించారు.

హక్కులు, ప్రత్యేక గుర్తింపు కోసం ఇక్కడి ప్రజలంతా ధైర్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ‘ఢిల్లీ నుంచి న్యాయం జరుగుతుందని మీరు ఆశించగలరా? అది సాధ్యమా?! పోరాటానికి సిద్ధంకండి. లేదంటే మనం కనుమరుగవుతాం.. గుర్తింపు కూడా ఉండదు’ అని పేర్కొన్నారు. ‘దేశవ్యాప్తంగా ముస్లింలు ఐక్యంగా ఉండాలి.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇండ్లు, దుకాణాలు, ప్రార్థనా స్థలాల కూల్చివేతలకు వ్యతిరేకంగా పోరాడాలి. హక్కులను కాపాడుకునేందుకు కలిసికట్టుగా ముందుకు రావాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని కొన్ని సంస్థలు కేంద్రంలోని అధికార పక్షానికి అమ్ముడుపోయాయి’ అని ఆయన ఆరోపించారు. ఫరూక్ అబ్దుల్లా చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. 

ఫరూక్.. పాక్‌కు వెళ్లిపోవచ్చు: బీజేపీ

ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. బీజేపీ జమ్మూకశ్మీర్ అధ్యక్షుడు సత్ శర్మ మాట్లాడుతూ.. ‘భారత్‌లో తనకు నచ్చినట్లు మాట్లాడే స్వేచ్ఛ ఫరూక్ అబ్దుల్లాకు ఉంది. ఆ స్వేచ్ఛ వల్లే ఆయన ఇలాంటి కామెంట్లు చేయగలిగారు. ఇలా స్వేచ్ఛగా పాకిస్థాన్‌లో మాట్లాడి ఉంటే ఎవరూ వదిలిపెట్టేవారు కాదు’ అని మండిపడ్డారు.

భారత్‌లో జమ్మూకశ్మీర్ ముస్లింలు సురక్షితంగా ఉన్నారని, ఆర్టికల్ 370 రద్దు పరిణామాలను ఫరూక్ అబ్దుల్లా మరిచిపోయినట్లు ఉన్నారని పేర్కొన్నారు. చేసిన కామెంట్లకు వెంటనే భారతదేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని, లేకపోతే అంత ప్రేముంటే పాకిస్థాన్‌కు వెళ్లిపోవచ్చని సత్ శర్మ అన్నారు. బీజేపీ మరో సీనియర్ నాయకుడు రవీందర్ రైనా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ ప్రజలను చంపుతున్నదే పాకిస్థాన్ అని పేర్కొన్నారు.

అలాంటి పాకిస్థాన్ వల్లనే కశ్మీరీలు బతుకగలుగుతున్నారని ఫరూక్ అబ్దుల్లా అనడం దారుణమని మండిపడ్డారు. విశ్వహిందూ పరిషత్ నేత వినోద్ బన్సల్ మాట్లాడుతూ.. భారత్ వల్లనే జమ్మూకశ్మీర్ సురక్షితంగా ఉందనే విషయాన్ని ఫరూక్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ‘దేశ ద్రోహుల తీరు మారడం లేదు. భారత్‌లో ఉంటూనే పాకిస్థాన్‌ను పొగుడుతున్నారు. పాకిస్థాన్ వల్ల కశ్మీర్ సురక్షితంగా ఉందా? లేక పాకిస్థాన్‌కు భారత్ తన బలాన్ని చూపడం వల్ల సురక్షితంగా ఉందా? అనే విషయం తెలుసుకోవాలి’ అని ఆయన సూచించారు.  


 

మరిన్ని వార్తలు