ఒకేరోజు రెండు పరీక్షలా?

25-10-2026 | 05:25am
  1. అటు ఎస్‌ఎస్‌సీ జేఈ, ఇటు టీజీపీఎస్సీ ఏఈఈ ఎగ్జామ్స్ 
  2. రెండింటికీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తీవ్ర నష్టం
  3. నవంబర్ 6న జరిగే ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలి
  4. సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ బహిరంగ లేఖ

అక్టోబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న ఇంజినీరింగ్ అభ్యర్థుల అవకాశాలను దెబ్బతీయొద్దని బీఆర్ ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) అన్నా రు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ)(Staff Selection Commission) నిర్వహించే జూనియర్ ఇంజినీర్ (జేఈ) పరీక్ష, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జిక్యూ టివ్ ఇంజినీర్(ఏఈఈ) పరీక్షలు.

ఒకే తేదీ లో ఉండటంతో వేలాది మంది తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంద ని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రెండు పోటీ పరీక్షలు రాసేలా ఎగ్జామ్ తేదీని మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. నవంబర్ 6న జరగనున్న టీజీపీఎస్సీ ఏఈఈ (సివిల్) పరీక్షను వాయిదా వేయాలంటూ శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. ఏండ్ల తరబడి కష్టపడి రెండు పోటీ పరీక్షలకు సిద్ధమైన నిరుద్యోగ యువత.. పరీక్షల తేదీలు ఒకే రోజు రావడంతో ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అభ్యర్థుల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. 

టీజీపీఎస్సీ పట్టించుకోకనే..!

ఎస్‌ఎస్‌సీ నిర్వహించే జేఈ పరీక్షలు నవంబర్ 2 నుంచి 6 వరకు జరగనుండగా, టీజీపీఎస్సీ నిర్వహించే ఏఈఈ సివిల్ పరీక్షలు నవంబర్ 6, 7 తేదీల్లో నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. దీంతో నవంబర్ 6న రెండు పరీక్షలకు హాజరుకావాల్సిన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఎస్‌ఎస్‌సీ జేఈ పరీక్ష రాసేందుకు ఇతర రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలకు వెళ్లే తెలంగాణ అభ్యర్థులు,

వెంటనే తిరిగి వచ్చి ఏఈఈ పరీక్షకు హాజరుకావడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రయాణ దూరం, సమయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా పరీక్షల తేదీలను నిర్ణయించడం వల్ల అభ్యర్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రెండు పరీక్షలకు అర్హత కలిగిన అభ్యర్థులు రెండింటికీ సిద్ధమవుతూ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కష్టపడుతున్నారని, అయితే పరీక్షల షెడ్యూల్‌లో సమన్వయం లేకపోవడంతో ఒక అవకాశాన్ని వదులుకోవాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

పరీక్షల తేదీలను మార్చాలని నిరుద్యోగ అభ్యర్థులు పలుమార్లు టీజీపీఎస్సీ అధికారులకు విజ్ఞప్తులు చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదన్నారు. అధికారులు సానుకూలంగా పరిశీలించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై అక్టోబర్ 14నే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పరీక్షల తేదీలను పునఃపరిశీలించాలని టీజీపీఎస్సీకి లేఖ రాసిన విషయాన్ని హరీశ్‌రావు ప్రస్తావించారు.

అయినప్పటికీ అభ్యర్థులకు అనుకూలంగా నిర్ణయం వెలువడకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఇలా ఒకే తేదీని ఎగ్జామ్స్ అనే పరిస్థితులు ఎదురైనప్పుడు తేదీలను మార్చిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీ ప్రతిష్ఠకు పోకుండా నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే జోక్యం చేసుకొని నవంబర్ 6న జరగనున్న టీజీపీఎస్సీ ఏఈఈ (సివిల్) పరీక్షను వాయిదా వేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. తద్వారా ఎస్‌ఎస్‌సీ ఏఈ, టీజీపీఎస్సీ ఏఈఈ రెండు పరీక్షలకు హాజరయ్యేందుకు అభ్యర్థులకు అవకాశం దక్కుతుందని తెలిపారు. 

 

మరిన్ని వార్తలు