మిల్లర్ల గుప్పిట్లో మార్కెట్!
- ధాన్యం కొనుగోళ్లలో గుత్తాధిపత్యం
- స్వేచ్ఛా మార్కెట్‌కు విఘాతం
- ప్రైవేటు వ్యాపారులు రాకుండా అడ్డంకులు
- ప్రమాదంలో అన్నదాత భవిష్యత్తు
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొనుగోళ్ల తీరుపై అనుమానాలు
- నిమ్మకు నీరెత్తిన యంత్రాంగం
బాన్సువాడ, అక్టోబర్ 24 (విజయక్రాంతి): ఆరుగాలం శ్రమించిన అన్నదాతకు(Provider of food (Farmer)) పంట చేతికొచ్చిన తర్వాత కొత్త కష్టాలు మొదలయ్యాయి. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని, అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పండించిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే.. మార్కెట్లో మిల్లర్ల సిండికేట్(Millers Syndicate) రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లుల యజమానులు పరస్పరం కుమ్మక్కై, ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు రంగంలోకి రాకుండా తెరవెనుక అడ్డంకులు సృష్టిస్తున్నారనే విమర్శలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
బయటి వ్యాపారులు వస్తే పోటీ పెరిగి రైతుకు మంచి ధర వస్తుందని, తమకు ధాన్యం విక్రయించే పరిస్థితి ఉండదని కొందరు మిల్లర్లు సిండికేట్‌గా మారి మార్కెట్‌ను శాసిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లర్ల కుమ్మక్కు వ్యాపారం నిజమైతే, మార్కెట్లో స్వేచ్ఛా యుత పోటీ నశించి, అన్నదాతకు కనీస మద్దతు ధర దక్కకుండా పోయే ప్రమాదం ఉంది. ధాన్యం కొనుగోళ్లలో రైతుకు పూర్తి స్వేచ్ఛ, న్యాయమైన ధర, పారదర్శకత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
వ్యాపారుల మధ్య పోటీని అడ్డుకుంటూ, రైతులను నిలువునా ముంచేందుకు జరుగుతున్న కుట్రలపై తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. రైతు బలహీనతను ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకోవాలని చూసే ఏ ఒక్కరినీ వదిలిపెట్టకూడదు. అన్నదాత శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా, మిల్లర్ల మాయాజాలానికి అడ్డుకట్ట వేసేలా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే శ్రమ ఒకరిది.. సంపాదన మరొకరిది అన్నట్లుగా మారుతుంది అన్నదాత పరిస్థితి!
వ్యాపార పోటీకి అడ్డుకట్ట వేస్తున్నారా?
ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్లోకి వస్తే రైతులకు ప్రత్యామ్నాయ కొనుగోలుదారులు అందుబాటులోకి వస్తారు. దీంతో మెరుగైన ధర కోసం బేరసారాలు చేసే అవకాశం పెరుగుతుంది. అయితే వ్యాపారులను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు నిజమైతే, అది స్వేచ్ఛాయుత మార్కెట్ వ్యవస్థకు విఘాతం కలిగించే అంశమే. కొనుగోళ్లలో ఎవరైనా ఆధిపత్యం చెలాయిస్తున్నారా? వ్యాపారుల మధ్య అనధికార ఒప్పందాలు ఉన్నాయా? రైతులకు అందుతున్న ధరలు, మార్కెట్లో ఉన్న ధరల మధ్య వ్యత్యాసం ఎంత? అనే ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది.
అన్నదాతకు న్యాయం చేసేదెవరు?
రైతుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అధికారులు ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని రైతులు, రైతు సంఘాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. మిల్లుల వారీగా కొనుగోళ్ల వి వరాలు, రైతులకు చెల్లిస్తున్న ధరలు, ప్రైవే టు వ్యాపారులకు ఎదురవుతున్న అడ్డంకులపై సమగ్రంగా పరిశీలించాలి. అక్రమ ఒ ప్పందాలు లేదా బెదిరింపులున్నట్లు ఆధారాలతో తేలితే బాధ్యులపై చట్టప్రకారం చ ర్యలు తీసుకోవాలి.
పంట కొనుగోళ్లలో పారదర్శకత లేకపోతే మధ్యవర్తుల ఆధిపత్యం పెరిగే ప్రమాదం ఉంది. అందుకే అధికారు లు కేవలం కార్యాలయాలకే పరిమితం కా కుండా కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద పరిస్థితులను పరిశీలించాలి. రైతులకందుతున్న ధరలపై పర్యవేక్షణ పెంచాలి. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకవ్యవస్థ ఏ ర్పా టు చేసి, వాటిపై సత్వర విచారణ జరపాలి.
ధాన్యం రైతుదే.. ధర నిర్ణయించే అధికారం ఎవరిది?
రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో మార్కెట్లో స్వేచ్ఛాయుత పోటీ ఉండాలి. ఎక్కువ ధర చెల్లించే కొనుగోలుదారుని ఎంచుకునే అవకాశం రైతుకు దక్కాలి. కానీ, కొంతమంది మిల్లర్లే కొనుగోళ్లను శాసిస్తూ, ఇతర వ్యాపారులకు అవకాశం లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొనుగోలుదారుల మధ్య పోటీ తగ్గితే దాని ప్రభావం ధాన్యం ధరపై పడే అవకాశం ఉంది. పెట్టుబడులు, కూలీ ఖర్చులు, సాగునీటి వ్యయాలతో ఇప్పటికే సతమతమవుతున్న రైతుకు గిట్టుబాటు ధర దక్కకపోతే అప్పుల భారం మరింత పెరిగే ప్రమాదం ఉంది.