టార్గెట్ హైదరాబాద్

25-10-2026 | 05:25am

ఒక్క ఎమ్మెల్సీ సీటుపైనే బీజేపీ కన్ను!

  1. వరంగల్ ఆశలు అంతంతే
  2. ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న పార్టీ ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్
  3. ఇక్కడ గెలిస్తే త్వరలో జరిగే ఖైరతాబాద్ ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తాచాటే అవకాశం
  4. మిగతా పార్టీలు కూడా ఇదే సీటుపై ఫోకస్

అక్టోబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics) ఇప్పుడు అందరిచూపు హైదరాబాద్ బూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు(Graduate MLC seat) పైనే. మామూలుగా చూస్తే ఇది కేవలం ఒక ఎమ్మెల్సీ ఎన్నికే. కానీ రాబోయే ఎన్నికలన్నీ హైదరాబాద్ కేంద్రంగానే జరగనున్న నేపథ్యంలో ఈ స్థానంలో విజయం సాధించడమే అన్ని పార్టీలకు సెమీ ఫైనల్‌గా మారింది. బీజేపీకి అయితే ఇది పూర్తిగా ప్రతిష్టాత్మకం.

వరంగల్- స్థానం కూడా కీలకమే అయినప్పటికినీ దానిపై బీజేపీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే మిత్రపక్షమైన జనసేన తన అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ, జనసేన పరస్పర అవగాహనతో అక్కడ ఒకవేళ అభ్యర్థిని నిలబెట్టినా.. బీజేపీ తన మెయిన్ టార్గెట్‌ను హైదరాబాద్ గ్రాడ్యుయేట్ సీటుగా మార్చుకుంటుందనే చర్చ నడుస్తోంది. 

సవాల్‌గా తీసుకున్న బన్సల్..

రాష్ట్రంలో బీజేపీ అధికారం కోసం ఎదురుచూస్తుంది. రాబోయే ఖైరతాబాద్ ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు, భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ ఎన్నికలే దీనికి సరైనా ఎంట్రీగా భావిస్తోంది. అందుకే పార్టీ ఇన్‌ఛార్జిగా సునీల్ బన్సల్‌ను మరోసారి అవకాశమిచ్చి అధిష్ఠానం నియమించింది. ఈ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే అన్నట్టుగా ప్రచారం జరిగేలా ఒక సవాల్‌గా తీసుకుని వ్యూహాలను ఆయన రచిస్తున్నారు.

గ్రాడ్యుయేట్ ఓటర్లలో బీజేపీకి బలం బాగానే ఉంది. హైదరాబాద్ అర్బన్‌లో బీజేపీకి ఉన్న క్యాడర్, ఆర్‌ఎస్‌ఎస్ బలం ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. అందుకే ఈ రెండు గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఒకటైన హైదరాబాద్ కచ్చితంగా గెలిచి చూపాలని బీజేపీ భావిస్తోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను ఓడిస్తే జనం బీజేపీ గురించి చర్చించుకుని ప్రత్యామ్నాయం తామే అనే సంకేతాలను తీసుకెళ్లాలనేది బీజేపీ వ్యూహంగా ఉంది.

ఈక్రమంలోనే హైదరాబాద్ ఎమ్మెల్సీని గెలుచుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వంతో ఆయన భేటీలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. గతంలో ఈ సీటు నుంచి ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు గెలిచిన నేపథ్యమూ ఉంది. ఇది కూడా బీజేపీకి కలిసొచ్చే అంశమే. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక ఖైరతాబాద్ ఉప ఎన్నికకు ట్రైలర్ లాంటిది. ఇక్కడ గెలిస్తే ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పార్టీ శ్రేణుల్లో ఊపు వస్తుంది.

అలాగే త్వరలో జరగనున్న గ్రేటర్‌లోని మూడు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపుకు ఇది టానిక్‌లా పనిచేస్తుంది. అంటే రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయం మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే నడుస్తుంది. ఇక్కడ గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి మోరల్ బూస్ట్ వస్తుంది. 

అన్ని పార్టీల ఫోకస్..

అన్ని పార్టీలకు హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం చాలా కీలకం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అర్బన్ గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎక్కువ. బీజేపీయే కాదు.. ఈసీటుపై కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్‌గానే దృష్టి పెట్టింది. వరంగల్ నియోజకవర్గాన్ని లోకల్‌గా బలంగా ఉన్న నాయకత్వాన్ని కాంగ్రెస్ వదిలేసింది. కానీ హైదరాబాద్, రంగారెడ్డి రెండు కీలకమైన జిల్లాలు. అలాగే మహబూబ్‌నగర్ సీఎం సొంత జిల్లా కూడా కావడంతో ఇది కచ్చితంగా గెలిచి తీరాల్సిన సీటుగా మారింది.

బీఆర్‌ఎస్‌కు కూడా ఈ సీటు ప్రతిష్టాత్మకమే. ఖైరతాబాద్ ఉప ఎన్నిక, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలంటే ఇక్కడ గెలవాల్సిందే. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇది సవాలే. అందుకే అన్ని పార్టీలు కూడా ఇదే సీటుపై ఫోకస్ పెట్టాయి. మరోవైపు పీఆర్టీయూ టీఎస్ ఉపాధ్యాయ సంఘం నుంచి వరంగల్ అభ్యర్థిగా సుంకరి భిక్షం గౌడ్‌ను ఇప్పటికే ప్రకటించింది. అయితే తమకు ఇక్కడ మద్దతు ఇస్తే హైదరాబాద్ స్థానానికి తమ మద్దతు ఉంటుందని చర్చలు జరుపుతోంది. 

 

మరిన్ని వార్తలు