ఆర్టీసీలో యాప్ తిప్పలు!
సంస్థ ఒక్కటే.. వేర్వేరుగా డిజిటల్ సేవలు
అందుబాటులో గమ్యం, అఫీషియల్, మీ టికెట్ యాప్‌లు
ఏది వాడాలో తెలియక తికమక
యాప్‌ల అనుసంధానంపై అధికారుల అలసత్వం
నవంబర్ 16 (విజయక్రాంతి): ప్రయాణికులకు(passengers) సులభతరమైన సేవలు అందించాల్సిన టీజీఎస్‌ఆర్టీసీ(TGSRTC)... తన యాప్‌లతో కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. బస్సు ట్రాకింగ్‌కు(Bus Tracking) ఒకటి, టికెట్ రిజర్వేషన్‌కు(Ticket Reservation) మరొకటి, బస్‌పాస్‌కు ఇంకొకటి.. ఇలా సేవకో యాప్ పెట్టడంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. ఒకే సంస్థ కింద నడుస్తున్న సేవలకు ఇన్ని రకాల యాప్‌లు ఎందుకన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ పెట్టింది పేరే అయినా, మారుతున్న కాలానికి తగ్గట్టుగా డిజిటల్ సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.
లేదంటే ప్రయాణికులు ప్రైవేటు వాహనాల(Private vehicles) వైపు వెళ్లే అవకాశం లేకపోలేదు. ఆర్టీసీ ప్రస్తుతం మూడు యాప్‌ల ద్వారా సేవలందిస్తోంది. టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేస్తూ అన్నింటినీ ఒకే ప్లాట్‌ఫాం మీదకు తీసుకురావాల్సి ఉండగా అలసత్వం వహిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. సర్వీసుల మధ్య తేడా ఉన్నా ఒకే సంస్థకి చెందినవే కాబట్టి, మూడు యాప్‌లను ఒకే గొడుకు కిందికి తీసుకురావాలనే డిమాండ్లు వస్తున్నాయి గత మూడేళ్లలో ఆర్టీసీ అందించే సేవల్లో అనేక మార్పులు వచ్చాయి. మాన్యువల్ టికెట్ నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ పొందడం, మొబైల్‌లోనే బస్‌పాస్ తీసుకోవడం వంటి ఆన్‌లైన్ సేవలు అందుతున్నాయి.
ఇక బస్టాండ్‌కు వచ్చే వరకు బస్సు సమాచారం తెలియని రోజుల నుంచి మొబైల్ యాప్‌తో బస్సు ఎక్కడుందో తెలుసుకునే అవకాశం ఏర్పడింది.తాజాగా బస్ భవన్‌లో అప్‌గ్రేడ్ చేసిన కమాండ్ కంట్రోల్ ద్వారా బస్సుల రాకపోకలు, రద్దీని, బస్ స్టేషన్లలో బస్సుల సమాచారాన్ని ప్రస్తుతం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇదంతా చేస్తున్న ఆర్టీసీ అధికారులకు ఈ మూడు యాప్‌లు ఒకే గొడుగు కిందకు తేవడం పెద్ద పనేం కాదు. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ వాళ్లు సేవలు అందిస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ అయిని ఆర్టీసీ ఎందుకు అందిచలేకపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మెరుగైన సేవలతోనే ప్రజలకు చేరువ
ప్రజారవాణాలో ఆర్టీసీ అతి పెద్దది. ఆర్టీసీ బస్సుల ద్వారా రాష్ట్రంలో రోజుకు 50లక్షల నుంచి 60 లక్షలు మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో దాదాపు 25 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. కండక్టర్‌తో చిల్లర సమస్యలు వస్తుండడంతో ప్రయాణికులు సైతం ఆన్‌లైన్ టికెటింగ్ వైపే మళ్లుతున్నారు. బస్‌పాస్ కౌంటర్‌కి వెళ్లాలంటే పెద్ద పని. అటువైపుగా వెళ్లే అవసరం లేకుండా ఆన్‌లైన్ పాసులనే తీసుకుంటున్నారు. ఆర్టీసీ తీసుకోచ్చే ఆన్‌లైన్ సర్వీసుల మీద అవగాహన పెరిగే కొద్దీ ప్రజల నుంచి ఆదరణ పెరుగుతూ ఉంది.
మరోవైపు బస్‌పాస్ వినియోగదారులకు ఆర్టీసీ ఇటీవల తొమ్మిది రాయితాలను కూడా ప్రకటించింది. ఈక్రమంలో ఈ యాప్‌ల సేవలను ప్రయాణికులు విస్తృతంగా ఉపయోగించుకునే వీలుంటుంది. ప్రయాణికులకు ఆర్టీసీ మరింత చేరువ కావాలంటే మరిన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. బస్సుల రాక పోకలను తెలిపే గమ్యం యాప్‌ను వాడే వారి సంఖ్య పెరుగుతోం ది.
ఈక్రమంలోనే ఈ సేవలన్నింటినీ ఒకే యాప్‌లో అందుబాటులో తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు దొరికితే సొంత, క్యాబ్, ఆటో ఇతర ప్రైవేట్ వాహనాల మీద ఎక్కువగా ఆధారపడరు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సులభమైన సేవలను ప్రయాణికులకు దక్కినప్పుడే ఆర్టీసీకి మరింత ఆదరణ పెరుగుతుంది.