‘ఓపీఎస్’పై కమిటీ వేయాలి

17-11-2026 | 05:10am

రెండో పీఆర్సీ సిఫార్సులు అమలు చేయాలి

ఇంటర్ బోర్డు ఉద్యోగులకు భరోసా ఇవ్వండి

ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ రాజశేఖర్ డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి) :  సీపీఎస్‌ను(CPS) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని(Old Pension System) (ఓపీఎస్)  పునరుద్ధరించేందుకు తక్షణమే కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి(Lachireddy), సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డును(Board of Intermediate Education) పాఠశాల విద్యాశాఖలో(Department of School Education) విలీనం చేసే ప్రతిపాదన నేపథ్యంలో బోర్డులో పనిచేస్తున్న బోధన, బోధనేతర ఉద్యోగుల ప్రయోజనాలకు భరోసా కల్పించాలని కోరారు. రెండో వేతన సవరణ సంఘం సిఫార్సులను 2023 జూన్ 1 నుంచి అమలు చేయాలన్నారు.

హైదరాబాద్‌లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం నిర్వహించిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అత్యవసర సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మార్పు చేసే అంశంపై ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు జరిపిందన్నారు. ఇదే అంశంపై సమగ్ర అధ్యయనం చేసి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నెలలు గడుస్తున్నా దీనిపై ఎలాంటి నిర్ణయం జరగలేదన్నారు.

సీపీఎస్ విధానం ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించడం లేదని, పాత పెన్షన్ విధానాన్ని  తిరిగి అమలు చేయాలన్నది ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, కార్యాచరణ ప్రారంభించాలని కోరారు. ఉద్యోగులకు సంబంధించిన ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా నేటికీ పెండింగ్‌లోనే  ఉన్నాయన్నారు. వీటిలో న్యాయమైన డిమాండ్లు, ఉద్యోగులసంక్షేమం, అభివృద్ధికి సంబంధించనవే ఉన్నాయని స్పష్టం చేశారు.

ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో 42 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సమస్యలను ఏకరవు పెట్టారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఎస్.రాములు, కె.హన్మంతరావు, బి. కృపాకర్‌రెడ్డి, బాణాలరామిరెడ్డి, డా.జి.నిర్మల, ఎల్.దర్శన్‌గౌడ్ , గరికె ఉపేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు