సమ్మక్క-సారక్క బరాజ్‌పై నేడు కీలక భేటీ
ఛత్తీస్‌గఢ్ సీఎంతో సమావేశం కానున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
చర్చలు ఫలిస్తే గోదావరి జలాల వినియోగానికి మరింత చాన్స్
శ్రీరాంసాగర్ రెండో దశ కింద 4.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం
హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ సాగునీటి రంగంలో(Telangana's Irrigation Sector) ప్రధానమైన సమ్మక్క-సారక్క బరాజ్(Sammakka Sarakka Barrage) విషయంలో మంగళవారం కీలక భేటీ జరగనుంది. ఛత్తీస్‌గఢ్ సీఎంతో(Chief Minister of Chhattisgarh) సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఎప్పుడో నిర్మాణం పూర్తయినప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడానికి అంతర్రాష్ట్ర అనుమతుల సమస్య అడ్డంకిగా మారింది. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ఎన్వోసీ(Chhattisgarh Government NOC) కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
ఇందులో భాగంగానే మంగళవారం ఆ రాష్ట్ర సీఎంతో తెలంగాణ సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. సమ్మక్క-సారక్క బరాజ్ పూర్తి నీటిమట్టం 83 మీటర్లు కాగా, గోదావరికి భారీ వరదలు వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ ప్రభావం మరింత ఎత్తు వరకు ఉండే అవకాశాలపై ఛత్తీస్‌గఢ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ముఖ్యమంత్రుల చర్చలు ఫలిస్తే గోదావరి జలాల వినియోగానికి మరింత అవకాశం లభిస్తుంది.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా మూడు అంశాలను ఛత్తీసగఢ్ ముందుంచే అవకాశం ఉంది. ముంపు ప్రభావిత ప్రాంతాలపై సమగ్ర అధ్యయన నివేదికను పరిగణనలోకి తీసుకోవడం.. ప్రభావిత రైతులకు భూములు, ఇళ్లకు పూర్తి పరిహారం చెల్లించడం.. అవసరమైతే పరిహారం మొత్తాన్ని ముందుగానే జమ చేయడం. ఈ ప్రతిపాదనలకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఎన్వోసీ జారీకి మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది.
డీపీఆర్ సవరణ మరో సమస్య
ఛత్తీస్‌గఢ్ ఎన్వోసీ సమస్య ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు కేంద్ర జల సంఘం వద్ద డీపీఆర్ పరిశీలనకు సంబంధించి కొత్త అభ్యంతరాలు ఎదురయ్యాయి. నవంబర్ 13న సమ్మక్క-సాగర్ ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపడం తెలంగాణ ప్రభుత్వానికి మరో సవాల్‌గా మారింది. ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టుకు నీరు అందించాలనే విషయంలో పూర్తి వివరాలు, కమాండ్ ఏరియా ధ్రువీకరణ సమర్పించలేదన్నది ప్రధాన అభ్యంతరం.
పాత డీపీఆర్‌లో 10 శాతం కమాండ్ ఏరియా మాత్రమే ధ్రువీకరించినట్లు పేర్కొంటూ, ప్రాజెక్టు పరిధిలోని మొత్తం ఆయకట్టును సమగ్రంగా సర్వే చేసి వివరాలు అందించాలని సీడబ్ల్యూసీ సూచించింది. కొత్త మార్గదర్శకాలకు తగ్గట్టు కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టు వివరాలను పూర్తిస్థాయి లో సమర్పించాలని కోరింది. దీంతో డీపీఆర్‌ను సవరించి మళ్లీ సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఛత్తీస్‌గఢ్ సీఎంతో సమావేశం కానున్నారు. గతంలోనూ ఉత్తమ్ కుమార్‌రెడ్డి పలుమార్లు ఛత్తీస్‌గఢ్ సీఎంతో సమావేశమై ఎన్వోసీ కోసం విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ ఢిల్లీలో భేటీ అయి ముంపు భూములకు పూర్తి పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఎన్వోసీపై స్పష్టత రాలేదు. ఇప్పుడు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగుతుండటంతో ఈ భేటీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
4.40 లక్షల ఎకరాలకు సాగునీరు..
సమ్మక్క-సారక్క బరాజ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తెలంగాణలోని పలు జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా శ్రీరాంసాగర్ రెండో దశ కింద 4.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, రామప్ప-పాకాల లింక్ కెనాల్ ద్వారా మరో 30 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు, దేవాదుల ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు నీటి లభ్యత పెంపు, మార్గమధ్యంలోని గ్రామాలకు తాగునీటి సరఫరాకు అవకాశం, గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునే అవకాశం లభి స్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, జనగామ జిల్లాల్లోని రైతులకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా శ్రీరాంసాగర్ రెండో దశ కింద నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయకట్టుకు స్థిరమైన నీటి సరఫరా సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.